• మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరపురాని సంవత్సరం 1990 

  • 4 డిఫరెంట్ తెలుగు మూవీస్ తో పాటు హిందీలోనూ అడుగుపెట్టింది ఈ ఏడాదే

  • వాటిలో ఒకటి ఇండస్ట్రీ హిట్.. మరొకటి బ్లాక్ బస్టర్.. ఇంకొకటి సూపర్ హిట్.. చివరిది యావరేజ్   

  • ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేని సరికొత్త కథనాలతో ప్రయోగాలు చేసిన చిరు.

  • నాలుగూ భారీ అంచనాలతో వచ్చినవే. వాటిలో ఇప్పటికీ క్లాసిక్‌లుగా నిలిచిపోయినవి మూడు.


టాలీవుడ్ లో 1990 చాలా ముఖ్యమైన సంవత్సరం. అలాగే చిరంజీవి కెరీర్ లో కూడా. అంతకుముందు ఏడాది అంటే 1989లో వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ పోకడను మార్చేశాయి. వాటిలో ఒకటి ‘గీతాంజలి’ అయితే రెండు శివ. రెండూ నాగార్జున నటించిన సినిమాలే కావడం విశేషం. అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనే విషయాన్ని పక్కనపెడితే టేకింగ్ పరంగా అప్పటివరకూ 70ల నుంచి ఒకే మూస పద్దతిలో పోతున్న టాలీవుడ్ కు షాక్ ఇచ్చాయి. మణిరత్నం.. రామ్ గోపాల్ వర్మలు ఒకే ఏడాదిలో ఫిల్మ్ మేకింగ్ లో క్రొత్త పద్దతులను నేర్పారు. మరోవైపు కోడి రామకృష్ణ తీసిన ‘అంకుశం’ సినిమా సూపర్ హిట్ తో ఒక్కసారిగా బిగ్ లీగ్ లోకి అడుగుపెట్టారు డాక్టర్ రాజశేఖర్.


ఒక్కసారిగా మారిపోయిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దానితో తదుపరి ఎలాంటి సినిమాలు తీయాలని అయోమయంలో ఉన్న తెలుగు సినిమాను కమర్షియల్ గా ఒడ్డున పడేసే బాధ్యతను చిరంజీవి తీసుకున్నారు. నిజానికి అప్పటికి చిరంజీవి ట్రాక్ రికార్డ్ కూడా పెద్దగా బాలేదు . 1989 లో నాలుగు సినిమాలు రిలీజ్ అయితే .. అందులో మూడు సినిమాలు బాగా నిరాశపరిచాయి. ఎప్పుడో జనవరి 1989లో రిలీజ్ అయిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సూపర్ హిట్ తర్వాత సరైన హిట్ లేదు. బి.గోపాల్ దర్శకత్వం లో టీ .సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా  వచ్చిన ‘స్టేట్ రౌడీ’ ఎబోవ్ ఏవరేజ్. రాఘవేంద్ర రావు ,యండమూరి, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన ‘రుద్రనేత్ర’ కూడా యావరేజ్ గా ఆడింది. ఇక అదే ఏడాది తొలిసారిగా దాసరి నారాయణ రావు -చిరంజీవి కాంబినేషన్ లో దాసరి 100వ సినిమాగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘లంకేశ్వరుడు’ సినిమా ఏకంగా ఫ్లాప్ అయింది. దానితో తన రేంజ్ హిట్ కొట్టాలని చిరంజీవి కొత్త ప్రయోగాలకు వెల్కమ్ చెప్పారు . అలా 1990లో వచ్చిన నాలుగు సినిమాలే 1) కొండవీటి దొంగ , 2) జగదేక వీరుడు -అతిలోక సుందరి ,3) కొదమ సింహం 4)రాజా విక్రమార్క. 



1) కొండవీటి దొంగ : రిలీజ్ డేట్  ( 9 మార్చి, 1990 )
జోనర్: రాబిన్  హుడ్  టైపు -కాస్ట్యూమ్ డ్రామా
రిజల్ట్: బ్లాక్ బస్టర్


కాస్ట్యూమ్ డ్రామాతో చిరంజీవితో ఒక సినిమా తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్న దర్శకుడు  కోదండ రామిరెడ్డికి పరుచూరి బ్రదర్స్ అందించిన కథ విపరీతంగా నచ్చింది. విజయశాంతి, రాధ హీరోయిన్ లుగా శారద , శ్రీ విద్యలు ప్రధాన పాత్రలో అమ్రిష్ పురీ ,రావు గోపాలరావు, మోహన్ బాబుల కలయికలో వచ్చిన కొండవీటి దొంగ సూపర్ హిట్ అయింది. ఇళయరాజా అందించిన అన్నిపాటలూ సూపర్ హిట్.  ఆనాటికి టాలీవుడ్ లో టెక్నికల్ గా ఉన్న హద్దులన్నీ చెరిపేస్తూ 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో 70mm లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన సినిమా ఇది. తరువాతి కాలంలో వచ్చిన డాల్బీ ,డీటీఎస్ సౌండ్ లకు మూలం ఇదే. ఇప్పటికీ ఈ సినిమా సౌండ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. నల్ల కోటు ,ఎర్రటి రుమాలు ధరించి ,తెల్లని గుఱ్ఱం మీద వస్తూ అడవుల్లో గిరిజనులను దోపిడీదారుల నుండి కాపాడే పాత్రలో చిరంజీవిని చూసి థ్రిల్ అయిపోయారు ఫ్యాన్స్.  9 మార్చి, 1990 లో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ లో రూపొందిన టెక్నీకల్ వండర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. కాకినాడ లోని ఆనంద్  70 mm ఏ /సి థియేటర్ లో 107 రోజులపాటు హౌస్ ఫుల్ కలెక్షన్ లతో ఆడి  రికార్డ్ సృష్టించింది. మొదటివారమే రూ.1.25 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ సినిమా. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో 4 ఆటలతో 100 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇదే . అప్పటికే బ్లాక్ బస్టర్  హిట్ గా నిలిచిన ఈ సినిమాను ముందు చేసుకున్న అగ్రిమెంట్ ల ప్రకారం రెండు నెలల తర్వాత రిలీజ్ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా కోసం కొన్ని థియేటర్‌ల నుంచి తప్పించాల్సి వచ్చింది. లేకుంటే ఇంకా చాలా రికార్డ్స్ సృష్టించేది ఈ సినిమా. 


2) జగదేక వీరుడు -అతిలోక సుందరి :
రిలీజ్ డేట్ : 9 మే 1990
జోనర్ : సోషియో-ఫాంటసీ
రిజల్ట్ : ఆల్ టైం బ్లాక్ బస్టర్ -ఇండస్ట్రీ హిట్


ప్పటి దాకా మాస్ ప్రేక్షకుల్లో ఎదురులేని హీరోగా కొనసాగుతున్న చిరంజీవిని కొత్తగా, చిన్న పిల్లల ఫేవరెట్ హీరోగా మార్చిన సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.  కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, ఇళయరాజా మ్యూజిక్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  మ్యాజిక్ ను క్రియేట్ చేసింది. ఆ రోజుల్లో ఏనాడూ కనీవినీ ఎరుగని రూ.6 కోట్లు షేర్‌ను తెచ్చింది ఈ సినిమా. ముందుగా చంద్రమండలం మీదకు వెళ్లిన చిరంజీవికి ఇంద్రజగా శ్రీదేవి పరిచయం అవుతుంది అని రాసిన కథకు యండమూరి వీరేంద్రనాథ్ స్వల్ప మార్పులు చేశారు. దానితో చంద్రమండలం ప్లేస్ లోకి మానస సరోవరం వచ్చి చేరింది. మరో ప్రముఖ దర్శకుడు జంధ్యాలతో కలిసి రాఘవేంద్ర రావు గారు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అప్పటికే బాలీవుడ్లోః నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన శ్రీదేవితో టాలీవుడ్ మెగాస్టార్ తొలిసారి హీరోగా నటించిన జగదేక వీరుడు -అతిలోక సుందరి పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు వారిద్దరూ కలిసి నటించిన ‘మోసగాడు’లో చిరు విలన్. ‘రాణీ కాసుల రంగమ్మ’లో యాంటీ హీరో. తమిళ సినిమా ‘రాణువ వీరన్‌’లో రజనీ కాంత్ - శ్రీదేవి హీరో హీరోయిన్ కాగా, చిరంజీవి విలన్. దానితో టాప్ స్టార్ లుగా ఎదిగిన తరువాత ఇద్దరూ హీరో -హీరోయిన్ లుగా మొదటిసారి నటించడంతో షూటింగ్ సమయం నుంచే అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. అప్పటి టాప్ క్లాస్ విలన్ లు అంతా ఈ సినిమాలో నటించారు. అమ్రిష్ పురీ , కన్నడ ప్రభాకర్ , రామిరెడ్డి లు విలన్ లుగా, బేబీ షామిలి, షాలిని, తరువాతి కాలంలో భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఏ ఫిలిం బై అరవింద్ లలో హీరోగా నటించిన మాస్టర్ రిషి లతోపాటు ఇతర కీలక నటులంతా ఈ సినిమాలో నటించారు . దేవలోకపు ఇంద్రజగా శ్రీదేవి  ఃతన ఉంగరాన్ని పారేసుకోవడం .. దాన్ని సంపాదించడం కోసం భూలోకం లో గైడ్ గా పనిచేసే చిరంజీవి వద్దకు చేరడం.. ఆ గైడ్ పెంచే పిల్లలతో ఆమె స్నేహం.. ఇంద్రజను బలి ఇవ్వాలనుకునే మాంత్రికుడు అమ్రిష్ పురి నుంచి ఆమెను రాజు (చిరంజీవి ) కాపాడడం.. చివరకు స్వర్గలోకాన్ని వద్దనుకుని ఇంద్రజ ,గైడ్ రాజు తోనే ఉండిపోవడం.. ఇవన్నీ ఆరోజుల్లో ప్రేక్షకులను ఊహాలోకంలోకి తీసుకెళ్లాయి. ఈ సినిమా రిలీజ్ సమయానికి ఆంధ్రా ప్రాంతంలో పెద్ద తుఫాను ఏర్పడింది. దీనితో కలెక్షన్ లు ఎలా ఉంటాయో అని యూనిట్ భయపడినా ప్రేక్షకులు మాత్రం వసూళ్ల వర్షం కురిపించారు. రూ.9 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.15  కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం హిట్ గా నిలిచింది. 200 రోజులు ఆడిన ఈ సినిమాతో మళ్ళీ నెంబర్ వన్ స్థానం తనదే అంటూ తెలుగు బాక్స్ ఆఫీస్ పై  స్టాంప్ వేసేశారు చిరంజీవి. అలాగే మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో చిరంజీవి కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. 


3) కొదమ సింహం 
రిలీజ్ డేట్: 9 ఆగస్టు 1990


జోనర్: కౌ-బాయ్
రిజల్ట్ సూపర్ హిట్ 


సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెరకు పరిచయం చేసిన కౌ బాయ్ జోనర్లో ఆ తరువాత చాలామంది హీరోలు ట్రై చేశారు. అయితే ఆయన రేంజ్ లో  అంతగా ఎవరూ సక్సెస్ కాలేదు. దానితో ఆ జోనర్ ను టాలీవుడ్ కొంతకాలం పక్కనపెట్టేసింది. దానికి దుమ్ము దులిపి మళ్ళీ పట్టాలెక్కించారు మెగాస్టార్. 1990లో యాక్షన్ సినిమాల దర్శకుడు కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘కొదమసింహం’. ఆరోజుల్లో చిరంజీవి సినిమా అంటే రెండు నెలలు పట్టేది. అలాంటిది ఈ సినిమా అంతకు రెట్టింపు టైం తీసుకుంది . కౌబాయ్ జోనర్ కు ట్రెజర్ హంట్ థీమ్ కలపడంతో బడ్జెట్ ఎక్కువైంది. లొకేషన్లు కూడా చాలా ఎక్కువ కావాల్సి వచ్చింది. ఏపీ,ల రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, కేరళతో కలిపి మొత్తం 5 రాష్ట్రాల్లో షూటింగ్ జరిపారు. ఈ సినిమాకు కథ అందించిన వారిలో శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ ఉండడం విశేషం. కథ పూర్తయ్యాక స్క్రీన్ ప్లేకు సహకారం అందించాలని చిరంజీవి స్వయంగా కోరడంతో పరుచూరి బ్రదర్స్ రంగంలోకి వచ్చారు. డైలాగ్స్ ను సీనియర్ రైటర్ సత్యానంద్ అందించారు. రాజ్- కోటి అందించిన మ్యూజిక్ అప్పట్లో ఒక ట్రెండ్ ను సృష్టించింది. ముఖ్యంగా "పిల్లో.. జాబిల్లో" పాటకు చిరంజీవి చేసిన డ్యాన్స్ ను ఆయన బెస్ట్ గా చెప్పేవారు ఉన్నారు. అలాగే  "జపం జపం జపం" పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. హీరోయిన్ లుగా రాధ, వాణి విశ్వనాధ్ లతోపాటు నాటి బాలీవుడ్ సంచలనం సోనమ్ ను సెలెక్ట్ చేశారు. విలన్లుగా కన్నడ ప్రభాకర్, బాలీవుడ్ నటులతో పాటు ఎంతో  క్రేజ్  తెచ్చిపెట్టిన సుడిగాలి పాత్రలో  మోహన్ బాబు నటించారు . చిరంజీవి-మోహన్ బాబు కలిసి నటించిన సినిమాల్లో ఇప్పటివరకూ ఇదే చివరి సినిమా. అలాగే రాధ చిరంజీవితో కలిసి నటించిన చివరి సినిమా కూడా ఇదే. కృష్ణ పరిచయం చేసిన కౌ-బాయ్ జోనర్ కు స్టైల్ ను జతచేశారు చిరంజీవి. గడ్డంతో మాచో లుక్ లో చిరంజీవి స్టిల్స్ విపరీతంగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఈ సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కొండవీటి దొంగ, జగదేక వీరుడు - అతిలోక సుందరి.. సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయ. సినిమా రిలీజ్ అవగానే చాలా పెద్ద ఓపెనింగ్స్ వచ్చాయి . అయితే అప్పటికి ఇంకా జగదేక వీరుడు -అతిలోక సుందరి ఇంకా ఆడుతూనే ఉంది. దానితో చిరంజీవి సినిమాకు చిరంజీవి సినిమానే పోటీ అయిపోయింది. దానితో ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన ‘కొదమ సింహం’ సూపర్ హిట్ గా మాత్రమే మిగిలింది. నైజాంలో ఏకంగా తొలిసారి  44 థియేటర్ లలో రిలీజ్ అయిన సినిమా ఇదే. 16 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 4 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. అంతే కాదు ఇంగ్లీష్ లోకి డబ్ కూడా అయింది. దానిపేరు ‘హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్’. అంతకు ముందు కృష్ణ గారి ‘మోసగాళ్లకు మోసగాడు’ మాత్రమే ఈ ఘనత సాధించింది. ఇప్పటికీ చిరంజీవి నటించిన టాప్ 10 సినిమాల్లో ‘కొదమసింహం’ది స్పెషల్ ప్లేస్. 


4) రాజా విక్రమార్క
రిలీజ్ : 14 నవంబర్ 1990
జోనర్ :  రొమాంటిక్ యాక్షన్ 
రిజల్ట్ : యావరేజ్ 


1990లో రిలీజ్ అయిన చిరంజీవి సినిమాల్లో బాగా నిరాశ పరిచిన సినిమా రాజా విక్రమార్క. 1988లో హాలీవుడ్ లో వచ్చిన కమింగ్ టూ అమెరికా సినిమాకు రీమేక్ ఇది. ఎక్కడో స్కంధ  ద్వీపం యువరాజుగా ఉండే చిరంజీవి రాచరిక కట్టుబాట్లు నుండి బయటపడడానికి ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టడం, అక్కడో అమ్మాయితో ప్రేమలో పడడం, కుట్రల నుండి ఆమెను, తన తల్లితండ్రులను కాపాడి తన రాజ్యానికి రాజు కావడం అనే కథాంశం తో రూపొందింది ఈ సినిమా. గజిబిజిగా ఉండే ఈ కథ మాస్ ప్రేక్షకులను నిరాశపరిచింది. అమల, రాధికలు ఈ సినిమాలో హీరోయిన్స్. రీమేక్ లు బాగా తీస్తాడన్నపేరున్న రవిరాజా పినిశెట్టి ఈ సినిమాకు దర్శకుడు. ఇదే కథతో 1990లోనే తమిళంలో ప్రభు హీరోగా ‘మై డియర్ మార్తాండన్’ అనే సినిమా రూపొందితే.. అది సూపర్ హిట్ అయింది. తెలుగులో మాత్రం చిరంజీవి రేంజ్ కు ఈ సినిమా కథ సెట్ కాలేదు అంటారు ఫ్యాన్స్. రాజ్-కోటి అందించిన మ్యూజిక్ మాత్రం హిట్ అయింది. ఆ ఏడాది చిరంజీవి నటించిన సినిమాల్లో జస్ట్ యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. కానీ జోనర్ పరంగా మాత్రం చిరంజీవి ట్రై చేసిన సినిమాల్లో ఒకటిగా రాజా విక్రమార్క నిలిచింది. 


5) ‘ప్రతిబంద్’తో హిందీ డెబ్యూట్ కూడా ఈ ఏడాదే :
రిలీజ్ : 28 సెప్టెంబర్ 1990 
హిందీ డెబ్యూ 
రిజల్ట్ : హిట్ 


చిరంజీవి హిందీ సినీ రంగ ప్రవేశం చేసింది కూడా 1990లోనే. అంతకు ముందు ఏడాది తెలుగులో దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన ‘అంకుశం’ సంచలనం సృష్టించింది. రాజశేఖర్ కు మాస్ లో యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిపెటింది. ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడ్డ చిరంజీవి హిందీలో రీమేక్ చెయ్యాలని అనుకున్నారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను ‘ప్రతిబంద్’ పేరుతో  హిందీలో రీమేక్ చేశారు. జుహీచావ్లా హీరోయిన్. ఈ సినిమా హిందీలోనూ హిట్ కావడంతో పాటు నార్త్ ప్రేక్షకులకు చిరంజీవిని పరిచయం చేసిన మూవీగా ప్రతిబంద్ పేరు నిలిచిపోయింది. 


ఈ రకంగా ఒకదానితో ఒకటి సంబంధం లేని సెపరేట్ జోనర్లలో మెగాస్టార్ చేసిన ప్రయోగాలు 1990లో ఆయన్ని బాక్సాఫీస్ కు రారాజు అని నిరూపించాయి. అందుకే ఆ ఏడాది ఆయన కెరీర్ లో చాలా స్పెషల్  ఇయర్ గా నిలబడిపోయింది. 


Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు



Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!