బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ టీడీపీ ఆఫీస్‌ ఇచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు మంత్రి జోగి రమేష్. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ పరిస్థితులు గురించి, ఇక్కడ పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి ఏం తెలుసని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోకుండానే కేంద్ర మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ గురించి కనీసం ఓనమాలు అయినా తెలుసుకుని వచ్చారా కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను ప్రశ్నించారు జోగి రమేష్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే.. గాంధీజీ కన్న కలలను నిజం చేస్తూ సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చామని వివరించారు. 2 లక్షల మంది యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయం మీకు తెలుసా, తెలియదా అని ప్రశ్నించారు.   


వికసించటానికి అదేమైనా పువ్వా..?  


మతతత్వ రాజకీయాలు చేసో, మతాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో పార్టీ వికసించాలంటే.. అదేమన్నా పువ్వు అనుకుంటున్నారా..? అని నిలదీశారు జోగి రమేష్‌.  బీజేపీ లీడర్ల కలలు కల్లలుగానే మిగిలిపోతాయన్నారు. ఇక్కడ నాయకులు పిలవగానే... ఢిల్లీ నుంచి వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని విమర్శించడం ఢిల్లీ వెళ్ళడం బీజేపీ లీడర్లకు అనవాయితీగా మారిందన్నారు. 2014-19 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీ హయాంలో మీరు చేసిన పనులేంటి..?. మీరు చేసిన మాఫియాలేంటి..? చంద్రబాబు దోపిడీలో మీరు భాగస్వామి అవునా.. కాదా..? అని నిలదీశారు. చంద్రబాబు-మీరు కలిసి నాలుగేళ్ళపాటు అధికారంలో ఉండి దోచుకుని దాచుకుంది నిజం కాదా...?. చంద్రబాబు అవినీతి సామ్రాజాన్ని మీరు పెంచి పోషించలేదా..? చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడి మాటలు నమ్మి తమపై నిందలు వేస్తారా అని సీరియస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడేనన్నారు.  


విభజన హామీలపై మాట్లాడకుండా.. మత చిచ్చు పెట్టలేరు: జోగి రమేష్


విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా..? అని ప్రశ్నించారు జోగి రమేష్. విభజన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఎందుకు నెరవేర్చలేదని అడిగారు. వాటి గురించి విజయవాడ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేకపోయారన్నారు. చేయాల్సింది మాత్రం చెప్పకుండా.. తమపై నిందలు వేసి వెళతామంటే.. జనం చూస్తూ ఊరుకోరు అన్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి, ప్రజలను నట్టేట ముంచిన పాపంలో బీజేపీ కూడా భాగస్వామి అన్నారు. బీజేపీకి  ఆంధ్రప్రదేశ్‌లో ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. విభజన హామీల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా.. మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనుకుంటారా..? అని క్వశ్చన్ చేశారు. 


మీ పార్టీలన్నింటినీ ప్రజలు ఒకే గాటిన కట్టారు...


 రాష్ట్రంలో బీజేపీ, కేఏపాల్ పార్టీ, జనసేనను ప్రజలు ఒకేగాటిన కట్టారన్నారు జోగి రమేష్. కేఏ పాల్ పార్టీకి ఎంత విలువ ఉందో.. బీజేపీకి అంతే విలువ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వార్డు మెంబరుగా కూడా బీజేపీ వాళ్ళు గెలవలేరన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత అన్యాయం చేసి.. రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. వచ్చి సోది చెప్పుకుని పోతే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, తమపై నిందలు మోపడంపైనే తాము ప్రశ్నిస్తున్నామన్నారు.  


పవన్ కల్యాణ్ బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి టూరిస్టులాంటి వారని...ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులో ఉంటారో అతనికే తెలియదన్నారు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి రావడం, నాలుగు మాటలు మాట్లాడి వెళతాడన్నారు. రాజకీయాల్లో అసలు ఉంటారో... పోటీ చేస్తారో ఏదీ స్పష్టంగా చెప్పరని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీగా.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తావా అంటే దానికీ సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరంటే అదీ చెప్పలేరన్నారు. అతనిదొక రాజకీయ పార్టీ, అతనొక నాయకుడా  అని ప్రజలు నవ్వుకుంటున్నార‌ని మంత్రి జోగి ఎద్దేవా చేశారు.