మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ హీరోల సరసన నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఈరోజున(ఫిబ్రవరి 18) అనుపమ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఆమె నటిస్తోన్న సినిమాల నుంచి కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే 'బటర్ ఫ్లై' అనే సినిమాకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆ సినిమా మేకర్స్ అనుపమకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా ఆమె నటిస్తోన్న '18 పేజెస్' సినిమా నుంచి కొత్త పోస్టర్ వదిలారు. ఇందులో అనుపమ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. నందిని అనే పాత్రలో అనుపమ కనిపించనుంది. నిఖిల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నిఖిల్ నటిస్తోన్న 'కార్తికేయ 2' సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది అనుపమ పరమేశ్వరన్. వీటితో పాటు మరిన్ని అవకాశాలు అందుకుంటోంది ఈ బ్యూటీ.