తాడిపత్రి ఇద్దరి నేతల మధ్య వివాదాలతో రగులుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో అదికారులు నలిగిపోతున్నారు. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రబాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య గతంలో ఉన్న విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రస్తుత వివాదానికి కారణం. ఆయన ఏం చేశారని ఆయన విగ్రహాన్ని తాడిపత్రి పట్టణంలో ఆవిష్కరిస్తున్నారన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి వాదన. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన తండ్రి విగ్రహావిష్కరణకు ప్రయత్నిస్తున్నారని వెంటనే ఆపాలంటూ మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చారు. అంతటితో ఆగకుండా కలెక్టర్‌ను కలిసి విగ్రహావిష్కరణ ఆపాలంటూ టీడీపీ కౌన్సెలర్లు వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఆ వివాదం ఇరు నేతల మధ్య ఆధిపత్య పోరుగా మారడంలో అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వద్దంటే ఎమ్మెల్యేకు కోపం.. విగ్రహావిష్కరణ చేయనిస్తే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఇబ్బందులు తప్పవు. దీంతో కమిషనర్ నరసింహ ప్రసాద్ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని పుంగనూరుకు వెల్లిపోయారు.


ఇరువురు నేతల మధ్య విభేదాలతో తాడిపత్రిలో ప్రతినిత్యం ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా అధికారుల వైఖరిని నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చేసిన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అధికారులు దిగివచ్చి ఛైర్మన్ చెప్పిన విధంగానే ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకొంటామని హామీ ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహావిష్కరణ కోసం ఎంచుకొన్న స్థలం అనంతపురం కడప హైవేపైన తాడిపత్రి పట్ణణంలోని యాక్సిస్ బ్యాంక్ ఎదరుగా ఉన్న రోడ్ పై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా స్థానిక మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా, హైవేపై విగ్రహాలు పెట్టకూడదన్న సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. 


మున్సిపల్ అదికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఈ విగ్రహావిష్కరణను అడ్డుకోకపోతే కోర్టుకు వెళ్లేందుకు కూడా తాము సిద్దం అని జేసీ ప్రబాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో అధికారులు కూడా ఎమ్మెల్యేకు చెప్పలేక వివాదం నుంచి బయటపడేందుకు కేవలం ట్రాన్సపర్ కరెక్ట్ అని భావించి బదిలీ చేయించుకొన్నారు. మిగిలిన అధికారులు కూడా ఇది తమకెక్కడ సమస్య అవుతుందో అని నలిగిపోతున్నారు. కొత్త కమిషనర్లు రారు.. తమకు ఇంచార్జ్ కమిషనర్ వద్దంటూ మిగిలిన అధికారులు ఉన్నతాదికారులకు మొర పెట్టుకొంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం కచ్చితంగా తన తండ్రి రామిరెడ్డి విగ్రహావిష్కరణ జరిగి తీరాల్సిందే అంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరి ఈ వివాదానికి అధికారులు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి మరి.