Andhra Pradesh News: మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెండో రోజున నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదేళ్లు తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఆ గ్రామంలో సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన నిధుల చిట్టా విప్పారు. అదే టైంలో టీడీపీ, జనసేనపై విమర్శలు చేశారు.
తాను ఐదేళ్లుగా ప్రజల ముఖాల్లో ఆనందం కోసం బటన్స్ నొక్కుతూ ఉన్నాని దాని వల్ల గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలని రిక్వస్ట్ చేశారు జగన్. ఎక్కడా లంచాలకు, రికమండేషన్స్‌కు తావులేకుండా నేరుగా మీ అకౌంట్స్‌లోకి ఇంటికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని విషయాన్ని గుర్తించాలన్నారు. ఎర్రగుంట్లలో 93 శాతం మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు జగన్.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం....
- అమ్మఒడి ద్వారా 1043 మంది తల్లుల ఖాతాల్లో 4.69 కోట్లు పడ్డాయి
- వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా రూ. 3 కోట్ల లబ్ధి చేకూరింది.
- ఆరోగ్య శ్రీ కార్డుతో వందల మంది ఆరోగ్యాలు బాగుపడ్డాయి. 2 కోట్లకుపైగా వారికి లబ్ధి జరిగింది.
- చేదోడు కింద 31.20 లక్షలు అందాయి.
- 1496 ఇళ్లు ఉంటే 1391 ఇళ్లకు ప్రభత్వ పథకాలు అందాయి.
- మొత్తంగా ఎర్రగుంట్లలో ఐదేళ్లలో 48.74 కోట్లు లబ్ధి జరిగింది.
గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదని కాదన్న జగన్... లంచాలు, అనుచరులకు మాత్రమే లబ్ధి జరిగేదన్నారు. తన కంటే ముందు చాలా మంది సీఎంలుగా పని చేశారని... సీనియర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి తీసుకొచ్చిన మార్పు ఏమైనా ఉందా అనిప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్పకుండానే ముసలాయన అంటూ విమర్శలు చేశారు. తాను చిన్న పిల్లోడిగా చాలా మార్పు తీసుకొచ్చానని వివరించారు. మళ్లీ ఆశీర్వదిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. జరిగిన మంచిని చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.