Women Leaders Are Losing Influence In Telugu State Politics: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను నిశితంగా గమనించిన వారికి ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఎంతోమంది మహిళా నేతలు కీలక స్థానాల్లో పని చేశారు. ముఖ్యమంత్రి ఎవరున్నా.. కీలక అమాత్య పదవుల్లో మాత్రం మహిళామణులు కూర్చునేవారు. రాజకీయంగానూ, ప్రజాసేవలో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు. అయితే, ఆ పరిస్థితి ప్రస్తుతం మారిందని.. రాజకీయాల్లో మహిళల ప్రాభవం తగ్గిందనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ఏ విషయంపైనైనా, ఏదైనా సమస్యపైనా మహిళా నేతలు పూర్తి అవగాహనతో.. అధికారమైన, ప్రతిపక్షమైనా అవతలి నేతలను ముప్పు తిప్పలు పెట్టేలా మాట్లాడేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. అసభ్య పదజాలాలు, దూషణ, ప్రతిదూషణలతో దిగజారిపోయేలా ఉన్న రాజకీయాల్లో అతి కొద్ది మంది మహిళా నేతలు మాత్రమే అన్నింటినీ తట్టుకుని నెగ్గుకొస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాజకీయ ముఖచిత్రంలో అప్పటి మహిళా నేతల ప్రాధాన్యం, నేటి మహిళా నేతల మనుగడ ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే...


2014 ఎన్నికలకు ముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హుందాగా సాగేవి. విమర్శలు కూడా సహేతుకంగానే ఉండేవి. పాలనాపరమైన అంశాల్లో లోపాలు ఎత్తి చూపించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసేవారు. పురుష నేతలకు ధీటుగా మహిళా నేతలు తమదైన మాటల తూటాలను పేల్చేవారు. ఈ జాబితాలో ఇటు శ్రీకాకుళం నుంచి అటు హైదరాబాద్ వరకూ ఎంతోమంది మహిళా నేతలు ఉన్నారు. 


పరిస్థితి మారింది


ఒకప్పుడు రాజకీయంగా ఉన్నత స్థానాలు అధిరోహించిన ఎంతోమంది మహిళా నేతలు ప్రస్తుత రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల భావన. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, గల్లా అరుణకుమారి, పనబాక లక్ష్మి, అలాగే టీడీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన నన్నపనేని రాజకుమారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పని చేసిన కొత్తపల్లి గీత, కిల్లి కృపారాణి, బుట్టా రేణుక వంటి ఎంతోమంది మహిళా నేతలు రాజకీయంగా ప్రస్తుతం యాక్టివ్ గా కనిపించడం లేదు. సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసినప్పటికీ గతంలో మాదిరిగా ఆమె యాక్టివ్ గా ఉండడం లేదు.


ఫైర్ బ్రాండ్స్


ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కొండా సురేఖ రాజకీయంగా ఎత్తుపల్లాలను ఎదుర్కొని.. మళ్లీ ఇప్పుడు బలంగా నిలబడగలిగారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చేరి మళ్లీ పునఃవైభవం దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే, మంత్రి సీతక్క సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆదివాసీల కష్టాలు తీర్చిన మనిషిగా వారి మనసులు గెలిచి నిలిచారు. ఇక మిగిలిన మహిళా నేతల్లో చాలామంది రాజకీయంగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గల్లా అరుణకుమారి పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయారు. కిల్లి కృపారాణి మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బుట్టా రేణుక వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆమె స్థానం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు. ఒకప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలను ఏకీపారేసేవారు. ఆమె నోటి నుంచి వచ్చే మాటల తూటాలు ఎదుటి పార్టీలను ఇబ్బందులకు గురి చేసేవి. అయితే, ఇప్పుడు ఈ మహిళా కీలక నేతలు పాలిటిక్స్ లో అంతగా యాక్టివ్ గా లేరు.


రాజకీయాల్లో ఈ నేతలు 


మరో కీలకమైన మహిళా నేతగా పురంధేశ్వరి పేరు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన దివంగత ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె.. తన తండ్రి ఏ పార్టీని అయితే వ్యతిరేకించారో అదే పార్టీలో చేరి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె రాజకీయంగా ఒడిదొడుకులను ఎదుర్కున్నారు. గడిచిన పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారే తప్పితే.. ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా తెలీలేదు. ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆమె.. రాజకీయంగా మునుపటి హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పనబాక లక్ష్మి ఒకప్పుడు కేంద్రమంత్రిగా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో ఈమె హవా ఎంతగానో నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఈమె జాడ ఎక్కడ కనిపించడం లేదు. కిల్లి కృపారాణి కూడా 2009లో పార్లమెంటు స్థానానికి ఎన్నికయ్యారు. విభజన తర్వాత ఈమె కూడా తన రాజకీయ మనుగడ కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీకే అరుణ కూడా సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఆశపడిన ఆమెకు.. అధిష్టానం అవకాశం కల్పించకపోవడంతో సైలెంట్ అయిపోయారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన కావలి ప్రతిభా భారతి.. ఒకప్పుడు స్పీకర్, మంత్రిగా పని చేసిన ఆమె.. ఇప్పటికీ రాజకీయంగా ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు. తన రాజకీయ వారసురాలి కోసం ప్రయత్నాలు సాగిస్తున్న ఆమెకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. 


ఆ వ్యాఖ్యలే.. విమర్శలు


ఒకప్పుడు మహిళా నేతలు చేసే విమర్శలు హుందాగా ఉండేవి. తాజా రాజకీయాల్లో ఆ విమర్శలు హుందాతనాన్ని కోల్పోవడం సహా ఆరోపణలు వ్యక్తిగత దూషణలకు సైతం వెళ్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలతో పోలిస్తే.. ఏపీలోని మహిళా నేతల తీరు కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార వైసీపీ నుంచి మహిళా నేతలు ఆర్కే రోజా, విడదల రజిని మంత్రులుగా ఉన్నారు. వీరిలో మంత్రి రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. అయితే, కొన్నిసార్లు ఈమె చేసిన వ్యాఖ్యలు శ్రుతిమించి ఉంటున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీకి చెందిన మహిళా నేతలు కావలి గ్రీష్మ, పంచుమర్తి అనురాధ మీడియా సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉంటున్నాయనేది కొందరి భావన. తెలంగాణలో ఇప్పటికీ కొంతమంది మహిళా నేతలు యాక్టివ్ గానే ఉన్నారు. వీరిలో కొండా సురేఖ, సీతక్క వంటి వారు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేస్తున్నారు. వీరు కాస్త హుందాతనంతోనే రాజకీయాలను సాగిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయాల్లో మహిళా నేతల ఆధిపత్యం తగ్గిపోగా.. సబ్జెక్టు వారీగా విమర్శలకు బదులు.. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు తావిస్తుండడంతో రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుందన్న విమర్శలు ఉన్నాయి.