ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కాన్వాయ్‌ను ఆర్‌డీఎక్స్‌తో పేల్చేస్తామని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడి కేవలం ట్రైలర్ అని.. తమ లక్ష్యం సీఎం యోగి అని ఆ ట్వీట్‌లో ఉంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.




ఆదివారం సాయంత్రం ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘Lady Done’ @ladydone3 అనే ఖాతా నుంచి ఈ ట్వీట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌ను హపుర్ పోలీస్, యూపీ పోలీస్ ఖాతాలకు సదరు యూజర్ ట్యాగ్ చేశారు. ఈ దాడిని ఆపాలని సవాల్ చేశాడు. గోరఖ్‌పుర్ భాజపా ఎంపీ, నటుడు రవి కిషన్‌ను కూడా ఆ యూజర్ ట్యాగ్ చేశాడు. యోగి ఆదిత్యనాథ్ సహా రవి కిషన్‌ను సోమవారం ఉదయం లోపు మానవ బాంబుతో పేల్చేస్తామని ఆ ట్వీట్‌లో హెచ్చరించాడు.


అప్రమత్తం..


ఈ ట్వీట్ చేసిన వెంటనే యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయించారు. 2022 ఫిబ్రవరిలో ఆ ట్విట్టర్ ఖాతాను క్రియేట్ చేశారు. ఆ ఖాతాదారుడు ట్విట్టర్‌లో ఒకరిని ఫాలో అవుతుండగా ఆ ఖాతాను ఇద్దరు అనుసరిస్తున్నారు. అంతేకాకుడా పాకిస్థాన్‌కు చెందిన ముజాహిద్ మొత్తం నాశనం చేస్తాడని ట్వీట్‌లో ఉంది.


ఓవైసీ దాడి తర్వాత..


ఓవైసీ వాహనంపై దాడి జరిగిన కొద్ది రోజులకే ఈ హెచ్చరికలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైసీ కాన్వాయ్‌పై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి దేశవాళీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఓవైసీ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యల వల్ల బాధపడే ఈ దాడి చేసినట్లు నిందుతులు ఆరోపించారు.


అసదుద్దీన్‌ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌-ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.


ఓవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'Z' కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. Z‌ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని అసదుద్దీన్‌ తిరస్కరించారు.

Also Read: Global Leader Approval Rating: మళ్లీ అయ్యగారే నం.1.. మరెవురివల్లా కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా మోదీ క్రేజ్