ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెటైర్లు వేశారు. ఇటీవల తన కల్లోకి శ్రీ కృష్ణుడు వచ్చాడని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మథుర, ఆగ్రా, బులంద్‌షహర్ నియోజకవర్గాల్లోని ప్రజలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న భాజపా ప్రభుత్వాన్నే మళ్లీ ఎన్నుకుంటే అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం రాదని, కరోనా సంక్షోభం నుంచి యూపీ కోలుకుంటుందన్నారు.
అఖిలేశ్ ఏమన్నారంటే..?
" శ్రీ కృష్ణ భగవానుడు ప్రతి రోజు రాత్రి నా కల్లోకి వచ్చి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ద్వారానే రామరాజ్యం స్థాపితమవుతుందని నాకు కృష్ణుడు చెప్పాడు. "
భాజపా అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తేల్చాయి. దీంతో భాజపా.. సమాజ్‌వాదీ పార్టీయే లక్ష్యంగా విమర్శల దాడి చేస్తోంది. అఖిలేశ్ యాదవ్ కూడా ఆ విమర్శలకు దీటుగా ప్రతిదాడి చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీతో భాజపా మైండ్ బ్లాక్ అయిందని అఖిలేశ్ అన్నారు.