Tirupati Assembly Constituency: ఎన్నికల షెడ్యూల్ వచ్చి పక్షం రోజులు దాటింది. మరికొన్ని రోజుల్లో మరో 20 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న సంకల్పంతో ఏర్పాడిన కూటమి లెక్కలు ఇంకా తేలలేదు. టెక్నికల్‌గా లెక్కలు తేలినా అసంతృప్తుల బెడద మాత్రం పట్టి పీడిస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి తిరుపతి. 


రహస్య సమావేశాలు


తిరుపతిలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆ స్థానం నుంచి పోటీకి సరైన వ్యక్తి కాదన్న వాదన వినిపిస్తున్నారు. మొదటి రోజు శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. 


చంద్రబాబు నిర్ణయం బట్టి...


కొందరు టీడీపీ లీడర్లు ఆరణి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా సమావేశమైనట్టు చెబుతున్నారు. ఏకమైన తిరుపతి టిడిపి ముఖ్య నేతలంతా జేబీ శ్రీనివాసుల ఇంట్లో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మరోసారి సమావేశమై... తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆయన చెప్పే సమాధానం బట్టి తమ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని అంటున్నారు. 


టికెట్ ఆశించి భంగపడ్డ సుగుణమ్మ


తిరుపతిలో టీడీపీ నుంచి సుగుణమ్మ టికెట్ ఆశించారు. అయితే కూటమి లెక్కల్లో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. అధినాయకత్వం బుజ్జిగించడంతో కాస్త శాంతించినట్టు కనిపిస్తున్నా... తమకు సీటు కేటాయించి ఉంటే చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇచ్చే వాళ్లమంటూ చెప్పుకొచ్చారు. 


ఆరణి శ్రీనివాసులపై ఆగ్రహం


జనసేనకు కేటాయించడంపై కోపం ఒక ఎత్తైతే... ఆ పార్టీ తీసుకొచ్చిన అభ్యర్థిని చూసి వారి ఆగ్రహం రెట్టింపు అయింది. జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు ఆఖరి నిమిషంలో జనసేనలో చేరి పార్టీ టికెట్ తీసుకున్నారు. ఆయనపై ఆనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికంగా కూడా ఆయనకు మంచి పేరు లేదని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన్ని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించడాన్ని నేతలు తప్పుబడుతున్నారు. 


ఏం చేయబోతున్నారో?


ఒక్క టీడీపీ నేతలే కాదు సొంత పార్టీ జనసేన నుంచి కూడా ఆరణి శ్రీనివాసులకు మద్దతు రావడం లేదు. బీజేపీ నేతలు సరే సరి. వారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించిన రోజునే తిరుపతి వ్యాప్తంగా శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఫ్లేక్సీలు వెలిశాయి. అప్పుడే కూటమిలో కలకలం రేగింది. క్రమంగా అన్నీ సర్దుకుంటాయని అధినాయకత్వం భావించినా... ఇంకా పరిస్థితులు కుదుట పడలేదని అర్థమవుతుంది. ఇప్పుడు  టీడీపీ నేతల సమావేశం అనంతరం వాళ్ల ఆలోచన భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.