10 reasons for Jagan  defeat : 2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు.  11 సీట్లకు అధికారాన్ని పోగొట్టుకున్నారు.  అత్యంత భారీ మెజార్టీతో గెలిచి దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు అదే స్థాయిలో ఓడిపోతూ.. మరోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా జగన్ ఓటమికి కూడా అనేక కారణాలుంటాయి. వాటిలో ఓ పది కీలకమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ! 


1. చంద్రబాబు అరెస్ట్   


రాజకీయాల్లో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడితే వారికి సానుభూతి వస్తుంది.  వారిని అరెస్టు చేయాలలంటే..  ఖచ్చితంగా తప్పు చేశారన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. అయినప్పటికీ ప్రజల సానుభూతి లభిస్తుంది. అందుకే రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి అధికారంలో ఉన్న వారు సందేహిస్తారు. కానీ జగన్ అలా అనుకోలేదు. చంద్రబాబును అర్థరాత్రి అరెస్టు చేయించారు. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు కోర్టులో సమర్పించడం కన్నా...  అడ్వకేట్ జనరల్ , సీఐడీచీఫ్ లను ఇతరచోట్లకు పంపి ప్రచారం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వరుస కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అభిప్రాయాన్ని కల్పించారు.  చంద్రబాబు తన అరెస్టు విషయాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోకపోయినా ఇది ప్రధాన అంశంగా మారిందని సెఫాలజిస్టులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. 


2. కూటమిగా విపక్షాలు ఏర్పడటం


ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడటం. గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ద్వారా వైసీపీ అధినేత జగన్ భారీగా లాభపడ్డారు. కానీ ఈ సారి అలాంటి అవకాశాన్ని విపక్షాలు ఇవ్వలేదు.  ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు..  ఓటు బ్యాంకులన్నీ కలసిపోవడంతో.. వైసీపీపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. చివరికి ఘన విజయం సాధించారు. 


3. రాజధాని , పోలవరం ఆగిపోవడం


విభజన తర్వాత ఏపీకి ఆశాకిరణాలుగా మారింది రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం,  తాము వస్తే శరవేగంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో వాటిని నిర్వీర్యం చేశారు. అసెంబ్లీలోకి అమరావతికి మద్దతు తెలిపి మరీ .. ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ తాను వచ్చాక మూడు రాజధానులని మాట మార్చారు. ఫలితంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. పోలవరం టీడీపీ హయాంలో శరవేగంగా నిర్మాణం జరిగితే.. వైసీపీ హయాంలో  ఒక్క శాతం కూడా ముందడుగు పడలేదు. 


4. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 


ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకున్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క సారిగా తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఉండటంతో అందులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చట్టంలో  వివాదాస్పదమైన అంశాలు ఉండటం.. తమ చేతుల్లో ఉన్న ఆస్తికి ప్రభుత్వం వద్ద మళ్లీ సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుందని..  ఈ క్రమంలో వివాదంలో పడితే ఏమీ చేయలేమన్న అభిప్రాయం ఏర్పడితే ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అది ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. 


ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు కానీ ఆధారాల్లేవు - ఎన్నికల ఫలితాలపై జగన్ వ్యాఖ్యలు


5. నాసిరకం మద్యం, భారీ ధరలు


పురుష ఓటర్లలో అత్యధికులు  వైసీపీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారని తేలింది. వాటికి ప్రధాన కారణాల్లో ఒకటి నాసిరకం మద్యం,  ప్రభుత్వం మారగానే కొత్త మద్యం విధానం తీసుకువచ్చారు. మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్లింది.  ప్రముఖ బ్రాండ్లేమీ అమ్మకానికిలేవు.పూర్తిగా కొత్త బ్రాండ్లు, నాసిరకం మద్యం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా పురుషులు..గతంలో వైసీపీకి ఓటేసిన వారు  కూడా ప్రభుతవానికి వ్యతిరేకమయ్యారు. 


6. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం 


జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారు.  బటన్లు నొక్కడమే తన పని అన్నట్లుగా వ్యవహరించారు. పార్టీ నేతలకు కూడా అదే చెప్పారు. తాను నొక్కాల్సిన బటన్లు నొక్కానని అంతా మీ చేతుల్లోనే ఉందని తేల్చారు. అయితే ప్రధానంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించలేకపోయారు. సంక్షేమం కారణంగా అభివృద్ధి పనులు నిలిపివేయడం, పరిశ్రమలు రాకపోవడం, ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. చివరికి యువత ఎక్కువ మంది కూటమి వైపు మారడానికి కారణం అయింది. 


7. శాంతిభద్రతల సమస్య 


ఏపీలో శాంతిభద్రతల సమస్య కూడా ప్రజల్ని ఆలోచింప చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు అనుకున్నవారు ఇష్టం వచ్చినట్లుగా దాడులు, దౌర్జన్యాలకు గురి చేసినప్పటికీ పోలీసులు గట్టి చర్యలు తీసుకోలేపోయారు. కానీ ఇతరులపై మాత్రం చట్టాన్ని విస్తృతంగా ప్రయోగించారు.  పలు చోట్ల దాడులు కామన్ అయ్యాయి.  చూసిన వారికి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారికి రక్షణ ఉండదన్న అభిప్రాయానికి  వచ్చారు. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వంపై ప్రజలకు భయం ఏర్పడితే అది ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుంది. 


8. బీసీ కార్పొరేషన్లు పెట్టినా నిధులివ్వకపోవడం 


ఏపీ ప్రభుత్వం అనేక కులాలకు కార్పొరేషన్లు పెట్టింది కానీ వాటికి నిధులు ఇవ్వలేదు.    నెలవారీగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లను..వారు ఏ వర్గానికి చెందుతారో.. ఆ వర్గానికి చెందిన సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చినట్లు చూపించారు.  బీసీ కార్పొరేషన్... ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్.. ఎస్టీలు అయితే..ఎస్టీ కార్పొరేషన్ ఇస్తున్నట్లుగా ఇచ్చారు.  మిగతా అన్ని పథకాలకు ఇచ్చే నిధులుకూడా అంతే.  ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా  ఆయా కార్పొరేషన్లకు కేటాయించి... ఆ తర్వాత ఆ నిధులను ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు బదిలీ చేసేవారు.  వివిధ వర్గాల వారికీ కార్పొరేషన్లు పెట్టిన లక్ష్యం వేరు.  ప్రజలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించడాన్ని ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకే విభిన్న రకాల స్వయం సహాయక కార్యక్రమాలు, ఉపాధి పథకాలు, రుణాలు అందిస్తూ.. మహిళలు, యువతకు ప్రత్యేకంగా సాయం చేస్తూంటాయి.  అలా ఎవరికీ స్వయం ఉపాధి సాయంచేయకపోవడంతో ఆ వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయింది.  


భారీగా తగ్గిన జగన్ మెజార్టీ - 60 వేల ఓట్ల మెజార్టీతో జగన్ గెలుపు


9.  రోడ్ల సమస్యలు 


ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు.  ఓ వైపు జాతీయ రహదారులు బాగుంటాయి.. మరో వైపు రాష్ట్రరహదారులు మాత్రం   వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. ఐదేళ్ల పాటు రోడ్ల సమస్యలు హైలెట్ గానే నిలిచాయి. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఇదిగో వేలకోట్లు పెట్టి కొత్తవి వేయిస్తున్నాం అని చెబుతూ వచ్చింది కానీ పనులు చేయించలేదు.చివరికి సీఎంజగన్ రూ. 43వేల కోట్లు పెట్టి రోడ్లు వేయించాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయని మేనిఫెస్టోలో చెప్పడం వివాదాస్పదమయింది. 


10. వ్యక్తిగత సమాచార  గోప్యత లేకపోవడంపై ప్రజల్లో ఆందోళన


వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి ఏమీ మేలు చేయకపోగా ప్రజల్లో ఆందోళనలకు కారణం అయింది. ఎందుకంటే వాలంటీర్లు ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తిగత సమాచారం సేకరించారు. చివరికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవా అన్నది కూడా సేకరించారు. అదంతా ఓ ప్రైవేటు కంపెనీకి చేరింది. మీ సమాచారం అంతా మాకు తెలుసన్నట్లుగా మెసెజులు కూడా వివిధ అంశాలకు సంబంధించి ప్రజలకు వచ్చాయి. ఇది గోప్యత లేకపోవడమేనన్న అసంతృప్తి ప్రజల్లో పెరిగింది.