AP Election Result 2024 Pulivendula :   వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డికి 61,169 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన 90 వేలకుపైగా మెజార్టీ సాధించారు. కానీ ఈ సారి  ఆయన మెజార్టీ 30వేలకు తగ్గిపోయింది. కుటుంబంలో చీలిక రావడం.. వైఎస్ షర్మిల  కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో పెద్ద ఎత్తున ఓట్లు చీలిపోయినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డికి 32 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవికి యాభై వేలకుపైగా ఓట్ల వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధృృవకుమార్ రెడ్డికి పది వేల ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దస్తగిరికి ఐదు వందల ఓట్లు వచ్చాయి. 


పులివెందులో వైఎస్ కుటుంబం  పోటీ చేయడం ప్రారంభించిన తర్వాత మరొకరు విజయం సాధించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీచినప్పటికీ.. పులివెందులలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తన పట్టును నిరూపించుకున్నారు. పార్టీ తరపున మొత్తం తొమ్మిది మంది గెలిస్తే అందులో జగన్మోహన్ రెడ్డికే అత్యధిక మెజార్టీ వచ్చింది. మిగిలిన వారు చాలా స్వల్ప తేడాతో గెలిచారు. పుంగనూరులో పెద్దిరెడ్డి మెజార్టీ కూడా భారీగా పడిపోయింది.