Telangana Elections News 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఓట్ల కోసం కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాల గురించి చెబుతూనే, వాటికి తోడు వివిధ వర్గాల కోసం కొత్త పథకాలను చెబుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్యాసింజర్ ఆటోలకు పర్మిట్ ఫీజు మాఫీ అని ప్రకటించగా, మంత్రి హరీశ్ రావు గిరిజన బంధు గురించి చెప్పారు. మంత్రి కేటీఆర్ గల్ఫ్ పాలసీ గురించి, గృహలక్ష్మీ పథకాలు తేనున్నట్లు చెప్పారు.


ఆటోలకు పర్మిట్ ఫీజు మాఫీ 
ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్యాసింజర్ ఆటోలకు ఫిట్ నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని చెప్పారు. ఫిట్ నెస్ ఫీజు రూ.700, పర్మిట్ ఫీజు రూ.500 రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లు ఏడాదికి ఓసారి ఫిట్ నెస్ చేయించుకోవాలి. ఫిట్ నెస్ కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు మొత్తం రూ.1200 అవుతుంది. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు.


గిరిజన బంధు
ఈ ఎన్నికల్లో గెలిస్తే గిరిజన బంధు ఇస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పాలకుర్తిలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకు విశ్వ ఖ్యాతి వచ్చింది కేసీఆర్ వల్లే అని అన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు అధికారం లోకి వస్తే ఢిల్లీ కేంద్రంగా పరిపాలన సాగుతుందని అన్నారు. 


గల్ఫ్ పాలసీ
తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికోసం ప్రత్యేకంగా ఒక గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే కొత్త సంవత్సరం జనవరిలో గల్ఫ్ పాలసీని అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రధానంగా గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన వారికి సైతం గల్ఫ్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా మాదిరిగా రానున్న ప్రభుత్వంలో గల్ఫ్ ప్రవాసీలకు కూడా బీమా అందిస్తామని పేర్కొన్నారు. ఈ గల్ఫ్ బీమా పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి రూ.5 లక్షల బీమా కవరేజ్ అందుతుందని తెలిపారు. గల్ఫ్ పాలసీలో భాగంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా కలిపి సమగ్రమైన పాలసీని అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. సిరిసిల్ల రోడ్ షోలో కేటీఆర్ ఈ ప్రకటన చేశారు.


కొత్తగా ఇల్లుకొనాలనుకునే వారికి గృహలక్ష్మి
ఇటీవల హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సు 2023 లో కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కేటీఆర్ చెప్పారు. కొత్తగా ఇళ్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాల కోసం త్వరలోనే కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. లోన్ తీసుకుని ఇళ్లు కొనుక్కోవాలనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే ఆ లోన్‌‌కు సంబంధించిన వడ్డీని కట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.