Huzurabad Politics: హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తనను గెలిపిస్తే విజయయాత్ర ఉంటుందని, లేదంటే తన శవయాత్ర ఉండడం ఖాయమని బహిరంగ సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆఖరి రోజున కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘ఇగో ఇక మీ దయ అంటున్న.. మీ దండం.. మీ గదవలు పట్టుకుంటున్న.. మీ కడుపులో తలకాయ వెడ్తున్న..’’ అంటూ కౌశిక్ రెడ్డి ఓటర్లను వేడుకున్నారు.


ఆ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఐపీసీ 171సీ, ఎఫ్, 188, 506, 123 ఆర్పీ యాక్ట్ కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవ్ తెలిపారు. ఓటర్లను భయపెట్టేలా, బెదరగొట్టేలా వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. ఈ కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఆర్వోకు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.


బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సీరియస్


బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రాలవని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తుండు. బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావు బిడ్డా. ప్రశాంతంగా ఉన్న హుజూరాబాద్ గడ్డను బ్లాక్ మెయిల్‌కు వాడటం మంచిది కాదు. రాజకీయాలను ఇంతగా దిగజార్చడం చూస్తే బాధగా ఉంది. కేసీఆర్ రెండేళ్లు నన్ను రాచి రంపాన పెట్టాడు. కేసీఆర్‌ను బొంద పెట్టడమే అంతిమ లక్ష్యం’’ అని ఈటల రాజేందర్ చెప్పారు. ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ లో ఎనలేని బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇది గత ఉప ఎన్నికలోనూ స్పష్టం అయింది.