Telangana Elections 2023 :  తెలంగాణ కాంగ్రెస్ నేతలు  బిర్లా టెంపుల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు.   పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ , మల్లు రవి తో పాటు పలువురు కీలక నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు.  వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు చేశారు. తర్వాత నాంపల్లి దర్గాలను సందర్శించి ప్రత్యేక  ప్రార్థనలు చేశారు. 


భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజులు                          


తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్ జి. కిషన్​ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్​లోని చార్మినార్​ను వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజలెవరూ డబ్బులు సహా ఇతర ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.


ఎన్నికల హడావుడిలో అభ్యర్థులు                                   


రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆయన తరపున ఎన్నికల బాధ్యతలను ఆయన సోదరులు చూసుకుంటున్నారు. టీ పీసీసీ చీఫ్ గా ఆయన రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించార. అభ్యర్థులకు వచ్చే సమస్యలు..  అధికార పార్టీ నుంచి వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు గాంధీభవన్ లో ఓ ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉంటున్నారు  ఎలాంటి అవసరం వచ్చినా తక్షణం స్పందిస్తున్నారు. 


దీక్షా దివస్ నిర్వహించిన  బీఆర్ఎస్ నేతలు                                     


మరో వైపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణదీక్ష ప్రారంభించిన తేదీ సందర్భంగా దీక్షా దివస్ ను బీఆర్ఎస్ నేతలు నిర్వహిచంకున్నారు. ఎ్నికల కోడ్ కారణంగా బయట ఎక్కడా కార్యక్రమాలను నిర్వహించలేదు. పలు చోట్ల పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించారు. తెలంగాణ భవన్  లో కేటీఆర్ రక్తదానం చేశారు.