Income Tax Raids On Ponguleti: తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతలా ఓట్ల కోసం తిరుగుతున్నారో అంతకంటే ఎక్కువ ఐటీ అధికారులు నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నేత, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, ఆఫీస్‌లపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తనపై కూడా ఐటీ రైడ్స్ జరుగుతాయని అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన విమర్శలు చేసిన రెండు రోజుల్లోనే ఐటీ అధికారులు రైడ్స్ షురూ చేశారు. 


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు , ఆఫీస్‌లపై ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వేకువజామున నాలుగు గంటలకే దిగబడ్డ అధికారులు ఆయన నివాసం ఉండే ఇంటితోపాటు ఆయనకు సంబంధం ఉన్న వివిధ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 8 వాహనాల్లో అధికారులు వచ్చినట్టు చెప్పుుకుంటున్నారు. హైదరాబాద్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండే నివాసంతోపాటు ఆయన ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఇక్కడ కూడా వేకువజాము నుంచే ప్రక్రియ కొనసాగుతోంది. 


పొంగులేటి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇంతలో ఐటీ రైడ్స్ జరుగుతుండటంపై ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. నామినేషన్ ఏర్పాట్లు చేస్తున్న టైంలో రైడ్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో వాళ్లందర్నీ హౌస్‌ అరెస్టు చేసిన అధికారులు వారిని ఎటూ కదలనీయడం లేదు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బయట వారితో మాట్లాడనీయడం లేదు.  ఐటీ రైడ్స్ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు భారీగా ఖమ్మం చేరుకుంటున్నారు. బయటవారిని ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు పోలీసులు.