Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టి (మంగళవారి)తో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ఈ సాయంత్రం 5గంటల  వరకే ప్రచారానికి అనుమతి ఇచ్చారు. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే ప్రచారం జరగనుంది. ఇక ఎల్లుండి (గురువారం) తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో  ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 


తెలంగాణ ఎన్నికల సందర్భంగా... గత నెల రోజులుగా హోరాహోరీ ప్రచారం జరిగింది. సభలు, ర్యాలీలు, రోడ్‌షోలతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహించాయి రాజకీయ పార్టీలు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార రథాలు పెట్టి ఊరూరా ఊదరగొట్టారు. పాటలతో మారుమోగించారు. తమకే ఓటు వేయాలని... మైకులు అరిగేలా ప్రసంగాలు చేశారు.  ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో.... ఈ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు ఎన్నికల బరిలో ఉన్న నేతలు.  సాయంత్రం వరకు ప్రచారం చేసి... సమయం ముగిసిన తర్వాత ఎక్కడివాళ్లు అక్కడ సద్దుకోనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి  వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం నుంచి ఎల్లుండి (గురువారం) సాయంత్రం  వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈ సాయంత్రం నుంచే మద్యం షాపులు మూతబడనున్నాయి.


ఇక.... మరోవైపు ప్రలోభాలపర్వం కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు... తమ ప్రాంతాల్లో బలాబలాలను అంచనా వేస్తున్నారు. కాస్త  బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. సరాసరిన ఓటుకు 2వేల  చొప్పున పంచుతున్నట్టు తెలుస్తోంది. ఒక పార్టీ ఓటుకు వెయ్యి ఇస్తుంటే... మరోపార్టీ రూ.1500.. ఇంకో పార్టీ ఓటుకు రూ.2వేల వరకు పంచుతున్నట్టు సమాచారం.  హేమాహేమీలు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో అయితే... డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రామాలలో మద్యం  సీసాలు కూడా డంపు చేసినట్లు తెలుస్తోంది. 


ఎన్నికల పోలింగ్‌కు మిగిలిన ఈ కొన్ని గంటల సమయంలో... ఇంకెంత మంది ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చే ప్రణాళికలు రచ్చిస్తున్నారు అభ్యర్థులు. ఇప్పటివరకు  అదిచేశాం... ఇది చేశాం... మళ్లీ పవర్‌ ఇస్తే అది చేస్తాం... ఇది చేస్తాం అంటూ ప్రచారంలో ఊదరగొట్టిన నాయకులు... ఇప్పుడు చివరి ప్రయత్నంగా ఓట్లు కొనేందుకు కూడా  సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు.


తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంటే... కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి  అధికారం చేపట్టాలన్న లక్ష్యంగా ఉంది కాంగ్రెస్‌. ఇప్పటికే గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు హామీ వర్షం కురిపించింది. మరోవైపు... బీఆర్‌ఎస్‌ కూడా సై అంటే సై అంటోంది.  కాంగ్రెస్‌ ఎన్ని వ్యూహాలు పన్నినా... ఈసారి కూడా గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది బీఆర్‌ఎస్‌. ఇక... తెలంగాణలో బీజేపీ కూడా బలం పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత  ఎన్నికల కంటే.. ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని పలు సర్వేలు చెప్తున్నాయి. 


ఇక ఎల్లుండి (గురువారం) పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో... ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119  నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి పోలింగ్‌ ఏర్పాట్లు మరింత వేగంగా జరగనున్నాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply