Telangana Election Result 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 11.30 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో, బీఆర్ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతోంది. 


Medak Election Results: మెదక్ జిల్లాలో కారు జోరు
మెదక్‌ జిల్లా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ అధికార పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. అందరి అంచనాలును తలకిందులు చేస్తూ ఇక్కడ బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. పది స్థానాలు ఉన్న మెదక్‌లో ఆరింటిలో కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. నాలుగు స్థానాల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు మినహా వేరే వాళ్లు ఈ మెదక్‌లో చోటు దక్కేలా కనిపించడం లేదు.


Hyderabad Election Results: హైదరాబాద్ లోనూ
హైదరాబాద్‌లో పరిస్థితి కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉంటే.. 8 స్థానాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఒక స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ మిగతా పార్టీలు కూడా ఖాతాలు తెరుస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ లీడ్‌లో ఉంది. ఇక్కడ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థులు నాలుగు స్థానాల్లో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపనట్టే కనిపిస్తోంది.


Rangareddy Election Results: రంగారెడ్డిలో కూడా
రంగారెడ్డి జిల్లాలో ఫలితాలు చూస్తే బీఆర్‌ఎస్‌ జోరు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కారు దూసుకెళ్లింది. 14 స్థానాలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో మూడంటే మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చూపగలిగారు. మిగతా 11 స్థానాల్లో మాత్రం కారు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. చంద్రబాబు అరెస్టు లాంటి అంశాలతో ఇక్కడ కారుకు స్పీడ్‌ బ్రేకర్లు ఉంటాయని అంతా భావించారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలో కారు తన పట్టు నిలుపుకునేట్టు కనిపిస్తోంది.


చంద్రబాబు అరెస్టు ఎఫెక్ట్ హైదరాబాద్ పై లేదా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ఇక్కడ అధికార పార్టీపై హైదరాబాద్ లో బాగా ఉంటుందని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్‌లో కారు పార్టీ జోరు కొనసాగిస్తోంది. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి వంటి నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి మాధవరం క్రిష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.