CM KCR Election Campaign: తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టాలన్నది బీఆర్‌ఎస్‌ లక్ష్యం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ప్రజా వ్యతిరేకతను కూడా పాజిటివ్‌గా  మార్చుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోంది. హ్యాట్రిక్‌ కొట్టి... రికార్డ్‌ సృష్టించాలని విశ్వప్రయత్నం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకున్న సీఎం  కేసీఆర్‌... ముమ్మరంగా ప్రచారం చేశారు. అక్టోబర్‌ 15 నుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. ముందు రోజుకు రెండు, మూడు నిర్వహించిన సీఎం కేసీఆర్‌... ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు. రోజుకు నాలుగు సభల్లో పాల్గొన్నారు.


అక్టోబర్ 15 నుంచి మొదలు


అక్టోబర్ 15న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి... అదే రోజు హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత  రోజుకు రెండు, మూడు, నాలుగు చొప్పున సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాలు  మినహాయించి రాష్ట్రాన్ని మొత్తం చుట్టేశారు. నిన్నటి వరకు 94 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌... ఇవాళ రెండు సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ కేసీఆర్‌ సొంత నియోజకవర్గం  అయిన గజ్వేల్‌లో సభతో కేసీఆర్‌ ప్రచారం ముగుస్తవుంది.


కేసీఆర్‌ పంచ్‌లు


సీఎం కేసీఆర్‌... తన సభల్లో ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ముఖ్యంగా కరెంట్‌, రైతుబంధు, ధరణిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌  వస్తే... 24గంటల కరెంట్‌ ఉండదని ప్రచారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డే ఆ విషయం చెప్పారని... 24గంటల కరెంట్‌ అవసరం లేదు.. మూడు గంటల ఇస్తే  సరిపోతుందని చెప్పారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అలాగే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దండగ అన్న విషయాన్ని కూడా ప్రచారం చేశారు.  ఇక... అతి ముఖ్యమైనది ధరణి... కాంగ్రెస్‌ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని... అదే జరిగితే.. మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు కేసీఆర్‌.  24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, ధరణిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తే... తాను కూడా ఏమీ చేయలేనని చెప్పారు కేసీఆర్‌. ఓటు వేసే ముందు ప్రజలు  ఆలోచించుకోవాలన్నారు.


తేడా గమనించాలన్న కేసీఆర్


ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ప్రచారానికి కూడా కౌంటర్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమే  సుభిక్షంగా ఉండి ఉంటే... ఎన్టీఆర్‌ రెండు రూపాయలకు బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదని పదేపదే ప్రశ్నించారు. ఏం చేశారని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని  ప్రశ్నించారు. అలాగే.. కాంగ్రెస్‌ వస్తే కుర్చీల కొట్లాట తప్ప ఇంకేమీ ఉండదని కూడా చెప్పారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌లో 12 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని... పదవి కోసం  కొట్టుకునే వారే తప్ప.. ప్రజల కోసం పనిచేసే వారు ఆ పార్టీలో లేరన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారెంటీలు అమలు కావడం లేదని... తెలంగాణలో కాంగ్రెస్‌ వచ్చినా  అలాగే ఉంటుందని చెప్పారు. అంతేకాదు... కాంగ్రెస్ వస్తే ఏది చేయాలన్న ఢిల్లీ బాసుల అనుమతి తీసుకోవాల్సి వస్తుందని.. కానీ, బీఆర్‌ఎస్‌ ఢిల్లీ బాసులు లేరని కూడా  ప్రజలు స్పష్టంగా వివరించారు. 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలన.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు తేడా చూసి ఓటు వేయాలని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్‌. 


తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌... తెలంగాణ ఇవ్వలేదని.. ఇచ్చేలా తాము పోరాడామని అన్నారు సీఎం కేసీఆర్‌. 2004లోనే తెలంగాణ ఉచ్చుంటే.. వందలాది  మంది బలిదానాలు చేసుకునేవారు కాదన్నారు. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టిన తర్వాత.. తెలంగాణ ఇవ్వక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందని...  అందుకే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. 


ఈ ఎన్నికల్లో మూడోసారి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటామన్నారు. పెన్షన్‌ను దశల వారీగా 5వేలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. అలాగే  గ్యాస్‌ సిలిండర్‌ను 400 రూపాయలకే ఇస్తామన్నారు. అలాగే.. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. రైతుబంధును 16వేలకు పెంచుతామన్నారు.  వీటితోపాటు మరిన్ని హామీలను కూడా ప్రకటించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాల్సి అవసరం ఉందని... ఇప్పుడు రాష్ట్రం  కాంగ్రెస్‌ చేతుల్లోకి వెళ్తే అది అసాధ్యమని అన్నారు. అందుకే... మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజా ఆశీర్వాద సభల్లో.. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్‌.