ఎన్నికలు ఏవైనా పరే... మొదట జరిగే ప్రక్రియ నామినేషన్లు వేయడం. ఇది అత్యంత కీలకమైనది. నామినేషన్లు ఓకే అయిన అభ్యర్థులే ఎన్నికల బరిలో ఉంటారు. ఈ నామినేషన్లలో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలి. విద్య, వ్యాపారం, ఆస్తులు, వారసత్వ సంపద, నేరచరిత్ర, కేసులు... ఇలా అన్ని వివరాలు అఫిడవిట్‌లో పొందుపరచాలి. దీన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు అయితే.. కొంత మంది అభ్యర్థులు అన్ని వివరాలను పొందుపరచు. అంతేకాదు.. ఇంకొందరు తప్పుడు వివరాలను కూడా నామినేషన్ పత్రాల్లో పొందుపరచవచ్చు. అలాంటి వారు ఉంటే... సామాన్యులు అయినా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇలాంటి అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో సామాన్యులు కూడా భాగం కావొచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఫిర్యాదులు ఉన్నా... వారి నామినేషన్ పత్రాల్లో అవకతవకలు ఉన్నా... వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.
ఒక అభ్యర్థి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన తర్వాత... ఆ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆ తర్వాత... రిటర్నింగ్ ఆఫీసు ముందు బోర్డుపై అఫిడవిట్‌ను ఉంచుతారు. ఆ ఆఫిడవిట్‌ను ఎవరైనా పరిశీలించవచ్చు. ఒకవేళ అందులో వివరాలు తప్పుగా ఉన్నా... లేక కీలకమైన అంశాలు పొందుపరచకపోయినా.. వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పలానా అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు లేవనో.. లేక ఇచ్చిన సమాచారం తప్పనో... లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి లేఖ రాస్తే సరిపోతుంది. దీనికి ప్రకారం సంబంధిత అధికారులు చర్య తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో సామన్యులకు ఇచ్చిన హక్కు అది. దీన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు.
నామినేషన్లలో అవకతవకలు ఉన్నాయంటూ... ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరికి కోర్టు డిక్వాలిఫై కూడా చేసింది. అంటే... నామినేషన్ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ప్రజల ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా... నామినేషన్లు సరిగా ఇవ్వలేదన్న కారణంగా.. ఎమ్మెల్యే పదవులు వదలుకోవాల్సి వస్తుంది.
2018 ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా కృష్ణమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది ఏపీ హైకోర్టు. ఆయన చేతిలో ఓడిపోయిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇస్తే.. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కనుక.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు... సరైన వివరాలు ఇవ్వడం చాల ముఖ్యం. ఏ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అయినా తప్పులు, అవకతవకలు ఉంటే.. సామాన్యులు కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు.
ఇక... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలిరేజే 100 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరఫున కొడంగల్‌లో ఆయన సోదరుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా.. హైదరాబాద్ గోశామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారావు అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.