IT Raids in Sabitha Follower house: తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, బంధువుల ఇళ్లు.. వారికి సంబంధించిన కంపెనీలలో వరుస తనిఖీలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అలాగే తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు జరిగాయి.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ప్రదీప్‌రెడ్డి ఇంట్లో మూడు రోజులుగా జరిగిన ఐటీ శాఖ తనిఖీలు ముగిశాయి. గత మూడు రోజులుగా ఆయన ఇంటికి మొత్తం సోదా చేశారు ఐటీ అధికారులు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మహేశ్వరంలో ఎన్నికల ఖర్చుల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ అధికారులు చెప్తున్నారు. ప్రదీప్‌రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఐటీ అధికారులు తేల్చారు. ప్రదీప్‌రెడ్డితోపాటు కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నరేందర్‌రెడ్డి ఇంట్లో ఏడు కోట్ల 50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం నుంచి హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల రైడ్స్ చేశారు. రాజకీయ నాయకులు, వారి బంధువులతోపాటు... ఫార్మా కంపెనీలను కూడా టార్గెట్ చేశారు. కంపెనీల యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఉదయం నుంచి అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్‌సీపురం, వట్టినాగులపల్లి, గచ్చిబౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మైహోమ్ భుజాలో ఉంటున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు ప్రదీప్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఎన్నికల వేళ వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు అందుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగేలేటి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్, మాజీ మంత్రి జానా రెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. తమ ఇళ్లపై ఐటీ దాడులు... బీఆర్‌ఎస్, బీజేపీ కలిపి చేయిస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.