గద్వాల రాజకీయాలను డీకే కుటుంబం దశాబ్దాలుగా శాసిస్తోంది. గద్వాల నియోజకవర్గం అంటే డీకే ఫ్యామిలీ...డీకే ఫ్యామిలీ అంటే గద్వాల అనేలా మార్చేసుకున్నారు. డికే సత్యారెడ్డి నుంచి డీకే అరుణ వరకు గద్వాల రాజకీయాల్లో ప్రత్యేక ముద్రవేశారు. డీకే అరుణ కుటుంబానికి ఇది కంచుకోట. 70ఏళ్లుగా గద్వాల రాజకీయాలను డీకే కుటుంబమే శాసిస్తోంది. ప్రతిసారి గద్వాల ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాజీ మంత్రి డీకే అరుణ, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తలపడనున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలను లెక్కలేసుకొని సరితా తిరుపతియ్యను బరిలోకి దించింది. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యంగా మారింది.
కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న గద్వాలను నడిగడ్డ ప్రాంతంగా పిలుస్తారు. రాజకీయ చైతన్యం ఉన్న గద్వాల నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే సత్యారెడ్డి రెండుసార్లు, ఈయన పెద్ద కుమారుడు డికె సమరసింహారెడ్డి నాలుగుసార్లు, రెండో కుమారుడు భరతసింహారెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య డీకే అరుణ మూడుసార్లు గెలుపొందారు. అంటే మొత్తం తొమ్మిది సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందారు. అయితే 1994లో అన్నదమ్ములిద్దరూ పోటీపడితే టిడిపి మద్దతుతో ఇండిపెండెంటుగా ఉన్న భరతసింహారెడ్డి విజయం సాధించారు. అన్న సమరసింహారెడ్డిపై తమ్ముడు భరతసింహారెడ్డి పైచేయి సాధించారు. 1999లో బావా మరదళ్ళు పోటీపడి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన గట్టు భీముడు గెలుపొందారు.
కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు గెలిచింది. కోర్టు తీర్పు కారణంగా ఒకసారి కాంగ్రెస్ ఐ వశం అయింది. ఒకసారి టిఆర్‌ఎస్, ఒకసారి జనతా, ఒకసారి సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. మూడుసార్లు ఇండి పెండెంట్లు గెలిచారు. 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచిన గోపాల్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, సమరసింహారెడ్డి ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. డి.కె. సమరసింహారెడ్డి గతంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల మంత్రివర్గాలలో పని చేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పి.పుల్లారెడ్డి అలంపూర్‌లో రెండుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత మాజీమంత్రి డి.కె. సమరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరిపోయారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. గద్వాల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా పేరున్న అరుణ 2018లో తనకు మేనల్లుడు కృష్ణవెూహన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల తర్వాత అరుణ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార పార్టీకి డీకే అరుణ గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు.