Ponguleti srinivas Reddy clocks seized:
ఎన్నికలు షెడ్యూల్ రావడంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తే చర్యలు తప్పవని ఎలక్షన్ అధికారులు నాయకులను హెచ్చరించారు. అయినా సరే కోట్లాది రూపాయాలు, మద్యం, ఖరీదైన గిఫ్టులు సీజ్ అవుతున్నాయి. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు ఇంట్లో వాచ్ లను ఎన్నికల అధికారులు బుధవారం సీజ్ చేశారు. పొంగులేటి బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి ఇంట్లో 9750 వాచ్ లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.
గతంలో తన కుమార్తె వివాహాన్ని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో పెళ్లికి వచ్చిన వారికి ఖరీదైన బహుమతులను ఆయన ప్రదానం చేశారు. కుమార్తె వివాహం సమయంలో పంచగా మిగిలిన వాచీలను బంధువు ఇంట్లో పెట్టామని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఎన్నికలవేళ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ వాచ్ లను అధికారులు సీజ్ చేసారు. ఎలక్షన్ అధికారులు సీజ్ చేసిన పొంగులేటికి చెందిన వాచీల విలువ దాదాపు రూ. 39 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఎన్నికల్లో డబ్బు పంచే అవకాశాలున్నాయి - ఇన్ కం టాక్స్ డీజీ
నిన్నటివరకు (అక్టోబర్ 24 వరకు) 53.93 కోట్ల డబ్బు పట్టుబడిందని, అందులో ఎలాంటి డాక్యుమెంట్స్ లేని 1.76 కోట్లు సీజ్ చేశామని ఇన్ కం టాక్స్ డీజీ సంజయ్ బహదూర్ వెల్లడించారు. అందులో సరైన డాకుమెంట్స్ చూపించిన 10 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశామని తెలిపారు. మిగిలిన డబ్బు పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అన్నారు. 156 కిలోల గోల్డ్, 454 కిలోల వెండి పట్టుబడిందని చెప్పారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ గా రైడ్స్ చేసి 14.8 కోట్లు సీజ్ చేసిందని, బ్యాంక్ అకౌంట్స్ పై నిఘా ఉంచామని తెలిపారు.
ఇటీవల రెండు లారీలు సీజ్ - 2 కోట్ల విలువైన చీరలు స్వాధీనం
హైదరాబాద్ లో వారం రోజుల కిందట రెండు చీరల లోడ్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలోని బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేశారు. 743 బ్యాగ్ లలో ఉన్న రూ.2 కోట్లకు పైగా విలువ చేసే చీరలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చీరల విలువ రూ. 2,25,98,590/- (రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంబై ఎనిమిది వేల 5 వందల తొంబై రూపాయలు) అని సమాచారం.
ప్రగతినగర్ లోని అపార్ట్మెంట్ లో ఓ డబుల్ బెడ్ రూమ్ లో 2లారీల లోడ్ చీరలను డంప్ చేస్తున్న సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లారీలను సీజ్ చేశారు. సంచులలో చీరలు ఉన్నాయని విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వరంగల్ ప్రాంతంలోని కాశంపుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుంచి తాను చీరలు కొన్నానని వీటి యజమాని పోలీసులకు తెలిపారు. అయితే రిసీప్ట్ లాంటివి చూపించాలని, చీరల ఖరీదుకు సంబంధించి ఆధారాలు చూపించాలని పోలీసులు ఆయనకు సూచించారు. బాచుపల్లి పోలీసులు చీరలతో ఉన్న లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.