Telangana Election 2023 Memes:  


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. హమీలు, మ్యానిఫెస్టోలు, భరోసాలు, గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు సోషల్ మీడియాను బాగా వాడేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీని, అభ్యర్థులను ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియానే బెస్ట్ ఆప్షన్ గా సాగిపోతున్నారు. ప్రజల్లో క్రేజ్ తెచ్చుకునేందుకు వినూత్న పంథాను అవలంభిస్తున్నారు. మొన్నటి వరకు ప్రచారం అంటే పాటలు, కళారూపాలు, ప్రసంగాలు, మేనిఫెస్టోలోని హామీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సోషల్ మీడియాలో సెటైర్లు, పంచ్ లు పేల్చుతున్నారు. ప్రాస కూడా జతచేసి తమదైన శైలిలో పోస్టులు, వీడియోలతో సోషల్ మీడియానే తమ క్యాంపెయిన్ కు మాధ్యమంగా దూసుకెళ్తున్నారు.


ప్రచారంలో కొత్త ట్రెండ్
గత ఎన్నికల్లో సోషల్ మీడియా వాడకం పెరిగింది. ఈ ఎన్నికల్లో అది పీక్స్ కు చేరింది. ముఖ్యంగా యువత నుంచి 45, 50 ఏళ్ల వయసు వారు సోషల్‌ మీడియాలో ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ముందంజలో ఉందనే చెప్పాలి. ప్రజల్ని ఆకర్షించేలా రీల్స్ చేస్తున్నారు. బాగా ఫేమస్ అయిన రీల్స్, మీమ్స్ ను కాపీ కొట్టేస్తున్నారు. రీల్స్, మీమ్స్ ను తమకు అనుకూలంగా మార్చేసుకొని సోషల్‌ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారంలో కొందరు నేతలు దూసుకెళ్తున్నారు. రీల్స్, వీడియోలు షేర్ చేసి తాము చేసిన పనులు ఇవేనంటూ ఓటర్లను ఆకర్షించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. వాటిని పార్టీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. 


మల్లారెడ్డి ఏది చేసినా సెన్సేషనే
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఏది చేసినా ట్రెండే. సోషల్ మీడియా నాడి పట్టుకున్న కొద్ది మంది నేతల్లో మల్లారెడ్డి ఒకరు. మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ నవ్వులుంటాయి. పూలమ్మినా, పాలమ్మినా.. డైలాగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్. ఇప్పటికీ ఏదోచోట ఆయన కనపడగానే ఆ డైలాగ్ వినిపిస్తుంటుంది.  ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ పెద్దావిడను ఎత్తుకున్నారు... ఒళ్లో పెట్టుకొని లాలించారు. మంత్రి చేసిన ఈ సీన్ మాములుగా వైరల్ గా కాలేదు. ఎక్కడ చూసినా మల్లారెడ్డి ప్రచారం గురించే చర్చ నడిచింది. పేపర్లు, ఛానళ్లు దీనికి విపరీతంగా ప్రచారం కల్పించాయి.






ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన తీన్మార్‌ డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. మన అందరికీ 30వ తేదీన వేలికి ఇంకు, ఆ తర్వాత స్టేట్‌ అంతా పింకు పింకు అంటూ స్టెప్పులు వేస్తూ రచ్చరచ్చ వేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొందరు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.


హైదరాబాద్ అంటేనే హైపర్ గా ఉంటాం!
బిర్యాని తింటూనే ఇరానీ చాయ్ అంటాం. 
మనది హైద్రాబాదు 
దేశంలో మనమే జోరు 
మన కేటీఆరు
ఇగ సూడర జోరు .. అంటూ మిర్చి ఆర్జే స్వాతి మంత్రి కేటీఆర్ పై పాడిన ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మంత్రి కేటీఆర్ సైతం ఈ ర్యాప్ ను షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది.






మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్ నగర్ క్రౌడు.. డెవలప్మెంట్ ఆగొద్దు అంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్... ఎట్లుండే తెలంగాణ.... ఎట్లుండే తెలంగాణ....... ఎట్ల అయింది తెలంగాణ... అంటూ పంచ్ లు, ప్రాసలు వాడుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.






కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావు బ్యాండ్ మేళం ముందు పొలిటికల్ షెహరీలు వినిపిస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. మరికొందరు బీఆర్ఎస్ అభ్యర్థులు తమకు తోచినట్లు ప్రచారం కొనసాగిస్తున్నారు.


తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్ టీమ్..
బైబై కేసీఆర్ అని, సాలు దొర అంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో తమదైన స్టైల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల్ని ఆకర్షించేలా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ స్కామ్, కోల్ స్కామ్, కేసీఆర్ 420 అని కారు నెంబర్ తో ట్రెండ్ చేస్తున్నారు. ధరణి పోర్టల్ స్కామ్, జీవో 111 స్కామ్, కాళేశ్వరం స్కామ్ అని గాంధీ భవన్ లో పింక్ కారును తిప్పుడూ ఆ వీడియోను వైరల్ చేశారు.






కాళేశ్వరం ఏటీఎం, కేసీఆర్ 30 శాతం కమీషన్, దోపిడీ అంటూ ఏర్పాటు చేసిన స్కామ్ ఏటీఎంను కాంగ్రెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తోంది. రూ. 4 వేల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని బీఆర్ఎస్ నేత ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను హస్తం పార్టీ బాగా వాడేసింది. ఇదీ కేసీఆర్ సార్ రూలింగ్ అని సెటైర్లు వేస్తున్నారు. 






 








నియోజకవర్గానికో వార్ రూం
ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న బీఆర్ఎస్ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. నియోజకవర్గానికి ఒక వార్‌ రూమ్‌తో పాటు రాష్ట్రస్థాయిలోనూ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సైతం రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనని చెబుతూ.. కేసీఆర్ పాలనపై సెటైర్లతో సోషల్ మీడియాలో ట్రోల్స్ తో దూసుకెళ్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక పార్టీలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించింది. నాలుగు కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్‌ రూమ్‌లో వ్యూహరచన చేస్తున్నారు. వార్‌రూమ్‌లలో పొలిటికల్, మీడియా, క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఏర్పాటు చేసి వేర్వేరుగా బాధ్యతలు అప్పగించారు.