AP Elections 2024: ఆంధ్రప్రదేశ్IAndhrapradesh)లో వచ్చే ఎన్నికల(Elections)కు సంబంధించి టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawankalyan) తొలి జాబితా ప్రకటించారు. జనసేనకు 24 స్థానాలు కేటాయించగా అందులో ఐదు స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో వెల్లడించింది. పార్లమెంటు స్థానాలకు వచ్చే సరికి జనసేనకు 3 స్థానాలు కేటాయించారు. వాటికి అభ్యర్థలను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందో స్పష్టత వస్తుంది. అందుకే ఎంపీ అభ్యర్థుల జోలికి వెళ్లలేదు.
ఇప్పటి వరకు ప్రకటించిన దానిని బట్టి అసెంబ్లీకి ఉన్న మొత్తం 175 స్థానాల్లో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో టీడీపీ ఒక్కపార్టీని తీసుకుంటే.. మెజారిటీ స్థానాలు గత ఎన్నికల్లోను.. ఇంతకు ముందు ఓడిపోయిన అభ్యర్థులకే కేటాయించారు. కొన్ని స్థానాలలో మాత్రమే కొత్తవారికి అవకాశం ఇచ్చారు. తుని (యనమల దివ్య), కళ్యాణదుర్గం(అమలినేని సురేంద్రబాబు), చింతలపూడి(రోషన్ బాబు), కడప(మాధవి), పులివెందుల(బీటెక్ రవి), తిరువూరు(కొలికపూడి శ్రీనివాసరావు) ఇలా దాదాపు పాతిక నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. మిగిలిన వారంతా గత ఎన్నికల్లోనో.. ఇంతకు ముందో ఓడిన వారే.
ఇలా పాతముఖాలకు చోటు ఇవ్వడం వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వారికి గతంలో ఓడిపోయా రన్న సింపతి ఉండడం. ఇది పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండోది.. ఆర్థికంగా, కేడర్ పరంగా వారికి మంచి మార్కులు ఉండడం.. మూడు క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి పనిచేస్తున్న తీరు. ఈ మూడు అంశాలను ప్రామాణింకంగా తీసుకుని చంద్రబాబు ప్రయోగానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే.. అసమ్మతి ప్రభావాన్ని వీరు తట్టుకుని నిలబడగలిగితే.. బాగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
సర్వేలు చేసి మరీ ఎంపిక..
``వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి. సర్వేల ఆధారంగా.. ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తర్వాత.. ఎవరు ఏమనుకున్నా.. నేను చేసేది ఏమీలేదు`` అని తరచుగా చెప్పినట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అభ్యర్థులను ఎంపిక చేశారు. మార్పులు, చేర్పుల పరంగా ఆయన చెప్పింది చాలా వరకు జరిగింది. అయితే.. వీరిలోనూ చాలా వరకు పాత కాపులకే పట్టంకట్టారు. చింతలపూడి నియోజకవర్గంలో కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. సోమా రోషన్‌ను ఇక్కడ నిలబెడుతున్నట్టు ప్రకటించారు. ఇక, విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మరోసారి గద్దె రామ్మో హన్‌కే ఇచ్చారు. ఇక, నూజివీడులో వైసీపీ నాయకుడు కొలుసు పార్థసారథికి టికెట్ ఇచ్చారు. మైదుకూరులో(కడప)నూ పాత ముఖానికే అవకాశం ఇచ్చారు. పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మరోసారి పట్టం కట్టారు. మొత్తంగా చెప్పాలంటే చంద్రబాబు సర్వేలు చేసి మరీ ఎంపిక చేయడం గమనార్హం. ఇక, జనసేనలో ముందుగానే ఎంపిక చేసిన వారికి అవకాశం కట్టబెట్టారు.
వైఎస్సార్ సీపీపై ప్రభావం ఎంత?
ఉమ్మడిగా టీడీపీ-జనసేన ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ ప్రభావం వైస్సార్ సీపీపై ఎంత? అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఎవరికివారుగా పోటీ చేశారు. కానీ, తాజా ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. దీంతో ఓట్లు చీలకపోతే.. చాలా వరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి ఇబ్బంది తప్పదనే చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాల్లో వైసీపీ ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో 5వేల లోపు మెజారిటీతో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిన స్థానాలు 12 ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ -25, తిరుపతి -708, పొన్నూరు- 1,112, నెల్లూరు సిటీ - 1,988, తణుకు- 2,195, నగరి - 2,708, కొత్తపేట - 4,038, ఏలూరు - 4,072, యలమంచిలి- 4,146, తాడికొండ- 4,433, ప్రత్తిపాడు - 4,611, జగ్గయ్యపేట - 4,778. వీటిలో టీడీపీ-జనసేన మిత్రపక్షం ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. దీంతో ఈ 12 స్థానాల విషయంలో వైఎస్సార్ సీపీ ఆశలు వదులుకుంటుందా? లేక గట్టి ప్రయత్నం చేస్తుందా? అనేది చూడాలి.
2019 ఎన్నికల్లో 5 -10 వేల లోపు మెజారిటీ తో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచిన స్థానాలు 22 ఉన్నాయి. రామచంద్రపురం -5,168, మంగళగిరి - 5,337, కర్నూలు - 5,353, ముమ్మిడివరం -5,547, శ్రీకాకుళం - 5,777, మచిలీపట్టణం - 5,851, విజయనగరం -6,417, నరసాపురం - 6,436, ప్రత్తిపాడు (sc)- 7,398, తాడిపత్రి - 7,511, విజయవాడ వెస్ట్-7,671, పెడన -7,839, పీలేరు -7,874, అనకాపల్లి - 8,169, చిలకలూరిపేట - 8,301, బొబ్బిలి - 8,352, భీమవరం - 8,357, కాకినాడ రూరల్ - 8,789,
సంతనూతలపాడు - 9,078, కైకలూరు - 9,357, భీమిలి - 9,712, వేమూరు - 9,999 నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీ ఓట్లు చీలకుండా కనుక ఉంటే.. ఈ 22 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడడం కష్టమని అంటున్నారు పరిశీలకులు.