Chandrababu Comments In Denduluru Prajagalam: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోయి.. కూటమి పాలన రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు (Eluru) జిల్లా దెందులూరులో (Denduluru) మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను హత్య చేసిన వైసీపీ గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని.. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ ఇస్తామని, ఆశ వర్కర్లకు కనీస వేతనం పెంపునకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మరిన్ని హామీలను చంద్రబాబు ప్రస్తావించారు.


'రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు'


'మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాం. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తాం. నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ మెంట్ ఇస్తాం. పశువుల కొనుగోలు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇస్తాం. గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. 'గోపాలమిత్ర' పునర్నియామకం దిశగా చర్యలు చేపడతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజమ్ లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం. అలాగే, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


'9 గంటల ఉచిత విద్యుత్'


అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 'కాపు సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల నిధులు కేటాయిస్తాం. కాపు భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. అమరావతిలో 5 ఎకరాల్లో అల్లూరి స్మృతివనం ఏర్పాటు చేస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రకులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తాం. పేదల గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులను నియమిస్తాం.' అని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కాంక్షించే మేనిఫెస్టోను రూపొందించామని.. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని ఆయన పునరుద్ఘాటించారు.


Also Read: Nara Bramhani : మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం - మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి !