YS Sunitha Press Meet :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఘటన తర్వాత మా వారిని  కానీ..మమల్నికానీ ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం జగన్ ను వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. పులివెందులలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో.. అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో వివరించారు. కొన్ని ఫోన్ కాల్స్ వివరాలను వెల్లడించారు.           

  


వివేకా హత్య జరిగిన రోజున ఉదయం ఐదున్నర గంటలకు లోటస్ పాండ్‌లో జగన్ సమావేశం పెట్టారని.. ఆ సమావేశంలో మాజీ సీఎస్ అజేయకల్లం ఉన్నారన్నారు. ఐదున్నర సమయంలో ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత అజేయకల్లంకు వివేకా చనిపోయారని చెప్పారని సీబీఐకి.. ఆయన వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. తర్వాత ఆయన మాట మార్చితే.. వాంగ్మూలం రికార్డింగ్ ను సీబీఐ కోర్టుకు కూడా సమర్పించిందని గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి అదే రోజు 6.26 నిమిషాలకు ఫోన్ కాల్ వస్తే ఒక్క నిమిషాంలో వివేకా ఇంటి వద్ద ఉన్నారన్నారు. ఆ తర్వాత ఆయన భారతి పీఏ నవీన్ కు ఫోన్ చేసి ఆరు నిమిషాలు మాట్లాడారన్నారు. ఓఎస్డీ కృష్ణమోహన్, శివప్రకాష్ రెడ్డితోనూ మాట్లాడారని ఇన్ని ఫోన్ కాల్స్ మాట్లాడిన తర్వాత కూడా గుండెపోటు అని సాక్షిలో ఎందుకు వేశారని సునీత ప్రశ్నించారు.                     
 
 వివేకానంద హత్య అనంతరం కడప, పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ కరువు అయ్యిందని  ఆవేదన వ్యక్తం చేశారు.  కేసు గురించి మాట్లాడడానికి నిందితులను చూసి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  నిజమైన దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో తాను న్యాయ పోరాటం చేస్తున్నానని ..  వైఎస్‌ జగన్‌  అధికారంలో ఉండికూడా బాబాయి వివేకా హత్యపై ఎందుకు నోరు మెదపడం లేదని, నిందితులను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పులివెందుల , కడప   ప్రజలు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిందితులు మళ్లీ గెలుస్తే మరెంతో మంది బలి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. 


వైఎస్‌ రాజారెడ్డి  నుంచి వైఎస్సార్‌, వైఎస్‌ వివేకా వరకు ప్రజలకు నమ్మకం ఉండేదని, ప్రజలు ధైర్యంగా వెళ్లి సమస్యలు విన్నవించుకుని  పరిష్కరించుకునేవారని  సునీత గుర్తు చేసుకున్నారు.  వారి లక్షణాలు జగన్‌లో ఏ ఒక్కటి కనిపించవన్నారు.  ఇలాంటి స్థితిలో మీరెలా వారసులు అవుతారని సునీత ప్రశ్నించారు. ఎదైనా సమస్యలు చెప్పుకుంటే కేసులు పెట్టేస్తున్నారని సీఐడీని పంపుతున్నారని విమర్శిస్తున్నారు.   ప్రజా సమస్యలు చెప్పుకునే హక్కుకూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని పార్టీలకు అంటగట్టడం న్యాయమా అని ప్రశ్నించారు.  టీడీపీ గాని, ఇతర ఏ పార్టీలకు మద్దతుగా  తాను మాట్లాడటం లేదని.. న్యాయం కోసమే తన పోరాటం సాగుతోందన్నారు.