Nara Bramhani campaigning In Mangalagiri : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన భార్య, బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నారా లోకేష్ గత రెండు వారాలుగా అపార్టుమెంట్లు, కమ్యూనిటీలు, గ్రామాల్లో చిన్న చిన్న సమావేశాలు పెట్టారు. తాను మంగళగిరికి ఏం చేస్తానో చెప్పారు. ఇప్పుడు ఆయన మరో వారం రోజుల పాటు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రచారం కోసం నియోజకవర్గానికి నారా బ్రహ్మణి వచ్చారు. గత కొంత కాలం నుంచి వీలు కుదిరినప్పుడల్లా మంగళగిరి నియోజకవర్గానికి వస్తున్నారు. అక్కడి చేనేతలకు.. మహిళల ఉపాధికి అవసరమయ్యే కార్యక్రమాలను చేపడుతున్నారు.
తాజాగా మరో వారం రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం పర్యటనలో చేనేతల్ని.. స్వర్ణకారులను కలిశారు. 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు నారా బ్రాహ్మణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫ్ బజార్ లో బంగారు షాపులు, ఆభరణాల తయారీ యూనిట్ ను పరిశీలించారు. వ్యాపారాలు సాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువలరీ షాపులో స్వయంగా జుమ్కీలు కొనుగోలు చేశారు. లోకేష్ ని గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డెన్ హబ్ గా తయారు చేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పలు షాపుల్లో చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్ తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మంగళగిరి పట్టణంలో విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. వర్కర్లతో కలిసి ఆవకాయ పచ్చడిని కలిపారు. నిర్వాహకులు తయారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని రుచి చూశారు. పచ్చడి తింటుంటే చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఆవకాయ గుర్తొస్తోందన్నారు.
చిరు వ్యాపారులు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందేలా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చెరకు రసం అమ్మే మహిళతో మాట్లాడారు. చెరకు రసం తాగారు. తనకు సొంతిల్లు లేదని , లోకేష్ కి చెప్పి ఇప్పించాలని ఆ మహిళ కోరగా, తప్పకుండా సొంతింటి కల నెరవేరుస్తామని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. బ్రాహ్మణి అందరితో కలిసిపోతూ ప్రచారం చేస్తూండటం ప్రజల్ని కూడా ఆకట్టుకుంటోంది.