Jagan Comments On TDP Janasena Manifesto :  ఏపీలో టీడీపీ,జనసేన , బీజేపీ కూటమి మేనిపెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ముద్ర లేదు. కనీసం మోదీ ఫోటో లేదు. కానీ కూటమి సింబల్ మాత్రం ఉంది. ఈ మేనిఫెస్టో కార్యక్రమంలో ఏపీ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మేనిఫెస్టోకు తమ సపోర్టు ఉంటుందన్నారు. అయితే ఆయన మేనిఫెస్టో ఆవిష్కరణ  చేయలేదు. చంద్రబాబు, పవన్ మాత్రమే చేశారు. ఈ ఘటనలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేకపోవడంతో భిన్నంగా స్పందించారు. 


మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా.. మేనిఫెస్టోపై మోదీ బొమ్మ లేదన్నారు. మూడు పార్టీలు కలసి రెడీ చేసిన మేనిఫెస్టోలో మొదట మోదీ బొమ్మ ఉందని.. తర్వాత ఢిల్లీ నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. మోదీ ఫోటో మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారని జగన్  ప్రకటించారు. అందుకే మేనిఫెస్టో ప్రకటన ఆలస్యమయిందన్నారు. కూటమిలో ముగ్గురు ఉన్నా మోదీ ఫోటో పెట్టుకోలేని పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకోలేకపోయారని విమర్శించారు.  జగన్ మేనిఫెస్టో పెట్టి అమలు చేశాడు కాబట్టి వాటిపై ఓ రూపాయి ఎక్కువే ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు. 


వైసీపీ మేనిఫెస్టోకు  కౌంటర్ గా వారు కూడా లిస్ట్ చదువుతున్నారని.. ఈ లిస్ట్‌లో   స్కీంలు ఉన్నాయి అనుకుంటే నా మీద తిట్లు, శాపనార్ధాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల హామీలు ఉన్నాయన్నారు.   మీ సంస్కారానికి ఒక నమస్కారం, జగన్ ను ఎందుకు చంపకూడదు అంటు దారుణంగా మాట్లాడుతున్నారని  విమర్శించారు.  చేతకాని వారికి కోపమేక్కువ అని ఒక సామెత ఉంది. చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటి అంటే సమాధానం లేదన్నారు.  పాత మేనిఫేస్టో అమలు చేసింది లేదు, మరి కొత్త మేనిఫేస్టోకి విశ్వనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే కూడా సమాధానం రాదన్నారు.  ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ తిడితే ఎం ప్రయోజనం అని ప్రశ్నించారు.   ఎవరు ఇంటి ఇంటికి మంచి చేశారు, ఎవరు ప్రజల్ని మోసం చేశారనేది, వారి చరిత్ర అందరికి తెలుసని జగన్ వ్యాఖ్యానించారు.                          


వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో కొత్త హామీలు ఏమీ లేవు. నవరత్నాల అమౌంట్ ను కొంచెం పెంచుతామని జగన్ చెప్పారు . అదే సమయంలో పాత మేనిఫెస్టోలో ఉన్న మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి వాటిని తీసేశారు. అయితే ఆర్థిక పరిస్థితికి తనకు తెలుసని.. దానికి తగ్గట్లుగానే హామీలు ఇచ్చాని..  చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేయరని జగన్ చెబుతున్నారు. ప్రచారసభల్లోనూ అదే చెబుతున్నారు.