YSRCP And TDP Candidates List : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పోటాపోటీగా జాబితాలు విడుదల చేస్తున్నాయి. వైసీపీ అన్ని విడతల తర్వాత ఇడుపుల పాయలో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. ఇక టీడీపీ ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేయగా, ఈరోజు మూడో జాబితా వచ్చేసింది. తుది జాబితా తర్వాత టీడీపీలో ఇంకా 5 అసెంబ్లీ 4 లోక్ సభ స్థానాలకు మాత్రమే టికెట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీ, టీడీపీ రెండూ పూర్తి జాబితాలు విడుదల చేసినట్టయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నెల్లూరులో ముఖాముఖి ఎవరికెవరు పోటీయో ఇప్పుడు చూద్దాం. 


నెల్లూరు లోక్ సభ..( Nellore Parliament Seat)
నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ తరపున విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున మూడో లిస్ట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) పేరు ఖరారైంది. ఇటీవల వేమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరగా ఆయనకు నెల్లూరు లోక్ సభ టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాలను ఈసారి అసెంబ్లీ బరిలో నిలిపిన సీఎం జగన్, ఎంపీ స్థానానికి వ్యూహాత్మకంగా విజయసాయిని రంగంలోకి దింపారు. ఈ స్థానంలో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. 


అసెంబ్లీ స్థానాలు..


నెల్లూరు సిటీ..(Nellore City Assembly Candidates)
నెల్లూరు సిటీకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్(Khalil Ahmad) పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ(P. Narayana) బరిలో నిలిచారు. సిటీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) ని ఈసారి నర్సరావుపేట లోక్ సభ బరిలో నిలిపిన సీఎం జగన్.. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ అహ్మద్ ని అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. టీడీపీ నారాయణకు ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 


నెల్లూరు రూరల్..(Nellore Rural Assembly Candidates)
నెల్లూరు రూరల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotam Reddy Sridhar Reddy).. వైసీపీనుంచి టీడీపీలో చేరి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి(Adala Prabhakar Reddy) అదే పార్టీ నుంచి రూరల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. పోటీ గట్టిగా ఉన్నా.. టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డికి కాస్త ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తోంది. 


కావలి..(Kavali Assembly Candidates)
కావలిలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(Ramireddy Pratap Kumar Reddy)కి మరోసారి అవకాశమిచ్చారు సీఎం జగన్. టీడీపీ తరపున కావ్య కృష్ణారెడ్డి(Kavya Krishna Reddy)ని బరిలో దింపారు చంద్రబాబు. కావలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ టీడీపీకి లాభంగా మారే అవకాశముంది. 


ఉదయగిరి..(Udayagiri Assembly Candidates)
ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandra Sekhar Reddy) టీడీపీలోకి ఫిరాయించగా, అక్కడ అదే కుటుంబానికి చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి(Mekapati Rajagopal Reddy) వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా కూడా.. కాకర్ల సురేష్(Kakrla Suresh)అనే ఎన్నారైని చంద్రబాబు అభ్యర్థిగా ఖరారు చేశారు.  


ఆత్మకూరు..(Atmakur Assembly Candidates)
ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి(Mekapati Vikram Reddy) బరిలో నిలవగా.. టీడీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy)కి ఆఫరిచ్చారు చంద్రబాబు. అనేక తర్జనభర్జనల అనంతరం వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం, ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ప్రచారం బాగా ఆలస్యంగా మొదలైనట్టు లెక్క. వైసీపీ అభ్యర్థి మాత్రం ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గం చుట్టేశారు. హోరాహోరు పోరు జరిగే అవకాశముంది. 


కోవూరు..(Kovur Assembly Candidates)
కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Nallapureddy Prasanna Kumar Reddy)కే మరోసారి వైసీపీ నుంచి అవకాశం దక్కింది. టీడీపీ తరపున నిన్న మొన్నటి వరకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు వినిపించగా.. అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prasanti Reddy)కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ గట్టిపోటీనిచ్చే అవకాశముంది. 


సర్వేపల్లి..(Sarvepalli Assembly Candidates)
సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(Kakani Govardhan Reddy) వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, తీవ్ర చర్చల అనంతరం టీడీపీ మూడో జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandra Mohan Reddy) పేరు ఖరారైంది. వరుస ఓటముల సోమిరెడ్డిని ఈసారి కూడా ఓడిస్తానంటూ కాకాణి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ వైసీపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి ఎన్నికల నాటికి మరింత పెరిగితే టీడీపీ బలపడుతుంది. ఇక్కడ సోమిరెడ్డిని మరీ అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 


గూడూరు..(Gudur Assembly Candidates)
గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ ని వైసీపీ పక్కన పెట్టింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీధర్ ని తెరపైకి తెచ్చింది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పోటీకి దిగారు. 


సూళ్లూరుపేట..(Sullurpeta Assembly Candidates)
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సూళ్లూరుపేట. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ బరిలో నిలిచారు. 


వెంకటగిరి..(Venkatagiri Assembly Candidates)
వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కాగా, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. ఇక్కడ వైసీపీలో వర్గపోరు టీడీపీకి బలమయ్యే అవకాశముంది.