Godavari News: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక వ్యూహానికి విరుగుడుగా ప్రతివ్యూహాన్ని వైసీపీ రచిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ కాపు ఓటు చీలిక వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. కాపు ఓటును చీల్చేందుకు ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించింది వైసీపీ. మరింత మంది కాపు సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకువచ్చి ఎన్నికల్లో గెలవాలన్నది లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. 


పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు అదే నియోజకవర్గ ఇంచార్జ్‌గా వ్యవహరించిన మాకినీడు శేషుకుమారిని వైసీపీలోకి ఆహ్వించారు జగన్. తాడేపల్లికి రప్పించి వంగగీత సమక్షంలో పార్టీ కండువా కప్పారు. స్థానికంగా పలుకుడబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. 


కాపు నేతలను పార్టీలో చేర్చుకోవడమే కాదు వారితో ప్రచారం చేయించాలని భావిస్తోంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ముద్రవేసుకున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తిప్పాలని ప్లాన్ చేస్తోంది. ఇలా అన్ని మార్గాల్లోనూ గోదావరి జిల్లాల్లో కీలకంగా నిలిచే కాపు ఓటు బ్యాంకును రాబట్టేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


పిఠాపురంలో పాగా వేసేందుకు...
కాపులు అత్యధికంగా ఉన్నందునే కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎంపిక చేసుకున్నారు. అందుకే వంగా గీతను కూడా బరిలోకి దింపింది వైసీపీ అధిష్ఠానం. ఇప్పుడు జనసేన మాజీ ఇంచార్జి మాకినీడు శేషుకుమారి తదితర కాపు కీలక నేతలను వైసీపీలోకి చేర్చుకుంది. అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు ఓట్ల కోసం ఎత్తుకుపై ఎత్తుల వేస్తున్నాయి. అన్ని వర్గాలకు దగ్గరైన టీడీపీ ఇంచార్జ్‌ వర్మ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జనసేన అధినేత పవన్‌ పోటీ చేస్తే ఆయన్ని విజయం కోసం సర్వశక్తులు పెడతానన్నారు. పవన్‌ కల్యాణ్‌ కాకుండా మరెవరైనా పోటీచేస్తే తానే రెబల్‌గా బరిలోకి దిగుతానని వర్మ ప్రకటించారు. 


ఈ నియోజకవర్గాల్లో ప్రభావం..
జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాజోలు, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది. అయితే టీడీపీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం కీలకంగా నిలవనుంది.. రాజోలు, అమలాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్‌, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం కీలకంగా నిలువనుంది..