తెలంగాణలో రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతు బంధు పథకం నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల టైంలో రైతుల ఖాతాల్లో నిధులు వేయడం రూల్స్‌కు విరుద్ధమని వచ్చిన ఫిర్యాదు మేరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇలా ఈసీకి ఫిర్యాదు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇవాళ రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులను పడకుండా చేసింది మాత్రం కాంగ్రెస్ నేతలే అంటున్నారు.  


జహీరాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీష్‌ కాంగ్రెస్ వాళ్లే పని గొట్టుకొని ఫిర్యాదులు చేయించి రైతు బంధును బంద్ చేయించారని విమర్శించారు. రైతు బంధును ఆపేయించిన కాంగ్రెస్‌ వాళ్లను ఓటుతో పోటు పోడవాలని పిలుపునిచ్చారు. రైతు బంధు దుబారా ఖర్చని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని ఇప్పుడు ఆ డబ్బులు కూడా రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రిస్క్ వద్దని కారు గుర్తుకు ఓట్లు వేయాలని సూచించారు. 


మూడు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు ఓకే చెప్పిన ఈసీ సడెన్‌గా ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించారు హరీష్‌. దీనికి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదులే కారణమన్నారు. రైతు బంధు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌ లేదని ఒకేవేళ కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు మూసేస్తారని ఆరోపించారు. 


 రైతు బంధు ఎన్ని రోజులు ఆపుతారో చూద్దాం అన్నారు హరీష్‌. డిసెంబర్ 3 వరకు ఆపగలరేమో కానీ ఆ తర్వాత వారి వళ్ల కదాన్నారు. తరువాత వచ్చేది తమ ప్రభుత్వమే అని హరీష్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాతే రైతు బంధు పైసలు టింగు టింగుమంటూ పడతాయన్నారు. 


జహీరాబాద్‌లో వెలుగులు నింపింది కేసీఆర్ అని... మంచి నీళ్లు ఇచ్చింది కారు గుర్తు అని తెలిపారు. కరెంట్ విషయంలో పక్కనే ఉన్న కర్ణాటకను గుర్తు చేసుకోమన్నారు హరీష్‌. తప్పిపోయి కాంగ్రెస్‌కి ఓటేస్తే మూడు లేదా ఐదు గంటల కరెంటే దిక్కయితదని హెచ్చరించారు. కర్ణాటకలో వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ ప్రియాంక  చెప్పిండ్రని... కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇయ్యలేదన్నారు. 


 


కాంగ్రెస్‌ రైతు వ్యతిరేకత: కవిత


రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపేయించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రైతు బంధు ఇప్పటికే అమల్లో ఉన్న పథకమని, 10సార్లు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని గుర్తు చేశారు. అది ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టకున్నా ప్రవేశపెట్టిన పథకమని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు వెంటబడి రైతు బంధు పథకాన్ని ఆపించారని మండిపడ్డారు. ఈ పథకం కింద 65 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోట్ల మేర నిధులను ఇచ్చామని, దాంతో రైతులు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్న అభద్రతతో కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు వ్యతిరేకతను చాటుకున్నారని, రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్నారని నిప్పులు చెరిగారు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply