Telangana Assembly Elections 2023: మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి (Congress Candidate Bathula LakshmaReddy) తల్లి బత్తుల వెంకట్రామమ్మ(80) అనారోగ్యంతో మృతిచెందారు. తల్లి కన్నుమూసిన విషయం తెలియగానే లక్ష్మారెడ్డి ప్రచారం రద్దు చేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. బత్తుల వెంకట్రామమ్మ గత కొలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.




మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అవకాశం దక్కించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తో పోటీపడి లక్ష్మారెడ్డి అభ్యర్థిగా ఖరారయ్యారు. బీఆర్ఎస్ ను గద్దె దించాలని అందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే మార్గమని ఓటర్లను కోరుతున్నారు. మిర్యాలగూడలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, రుణమాఫీ హామీని సైతం బీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. కనీసం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలను కూడా భర్తీ చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.