Nellimarla Janasena candidate Lokam Madhavi : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేస్తున్న నామినేషన్లలో ఆస్తులను ప్రకటించాల్సి ఉంది.
ఈ ఆస్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరూ ప్రముఖ నేతల గురించి చెబుతున్నారు. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగిన నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తుల విషయంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఇప్పటి వరకూ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఆమె అత్యంత ధనవంతురాలు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు :
మాధవి ఆస్తుల విలువ రూ.894.92 కోట్లుగా లెక్కించారు. మిరాకిల్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్ వంటివి ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీ విలువు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. బ్యాంకు అకౌంట్‌లో రూ.4.42 కోట్లు, నగదు రూపంలో రూ.1.15 లక్షలు ఉంది. చర ఆస్తులు రూ.856.57 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.15.70 కోట్లు. అప్పులు రూ.2.69 కోట్లు ఉన్నాయి.
లోకం మాధవి ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత విదేశాల్లో ఉద్యోగం చేశారు. ఆమె భర్త లోకంప్రసాద్ తో కలిసి మిరాకిల్ సాఫ్ వేర్ కంపెనీని పెట్టారు. అమెరికాలో ఎక్కువ బిజినెస్ చేసే కంపెనీ అయినా స్వరాష్ట్రంలో ఆమె కంపెనీలను ప్రారంభించారు. ముంజేరు గ్రామంలోనూ మిరాకిల్ కంపెనీ గ్లోబల్ డెలివరి సెంటర్ ను పెట్టారు. విశాఖలోనూ క్యాంపస్ ఏర్పాటు చేశారు. అమెరికా కస్టమర్లకు ఇక్కడి నుంచే సాఫ్ట్ వేర్ సేవలు అందిస్తారు.
బోగాపురం ప్రాంతంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాతనే భోగాపురంలో ఎయిర్ పోర్టు ప్రతిపాదన వచ్చింది. అంతకు ముందే అక్కడ విస్తృతంగా విద్యా సంస్థలు, సాఫ్ట్ వేర్ ఆఫీసులు పెట్టారు. అయితే ఆమె వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. పలుమార్లు ప్రభుత్వ వేధింపులపై కన్నీరు మున్నీరయ్యారు. ఆ వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
గత ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ సారి పొత్తుల్లో భాగంగా టీడీపీ సీటు కేటాయించడంతో ఆమె పోటీ చేస్తున్నారు. విస్తృతంగా తిరుగుతున్నారు. గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు.తాను గెలిచిన తర్వాత నెల్లిమర్లకు.. సాఫ్ట్ వేర్ పరిశ్రమలు తీసుకు వస్తానని హామీ ఇస్తున్నారు. యువతకు మేలు చేస్తానంటున్నారు.