Telangana Election Candidates Assets: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18వ తేదీ నుంచి పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు... తమ ఆస్తులు.. అప్పులు.. కేసులు. ఇలా పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అఫిడవిట్ ప్రకారం... ప్రముఖ అభ్యర్థుల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆస్తులు వివరాలు
కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి (G.Kishan reddy Assets) ఆస్తుల విలువ 19.22 కోట్ల రూపాయలు. గత ఐదేళ్లలో ఆయన కుటుంబం ఆస్తులు 136శాతం పెరిగాయి. 2019లో కిషన్‌రెడ్డి ఆస్తులు రూ.8.1 కోట్లు ఉండగా... ఇప్పుడు రూ.19.2 కోట్లకు పెరిగాయి. కిషన్‌రెడ్డి చరాస్తుల విలువ రూ.8.3 కోట్లు కాగా... స్థిరాస్తుల విలువ రూ.10.8 కోట్లు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో కిషన్‌రెడ్డికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రూ.1.1 లక్షల విలువైన 1995 నాటి మారుతీ 800 కారు ఉంది. 2022 నుంచి 2023లో అతని ఆదాయం రూ.13.5 లక్షలు. అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కిషన్‌రెడ్డి టూల్స్ డిజైన్‌లో డిప్లొమా చేశారు.
పద్మారావుకు రూ.4.19 కోట్ల ఆస్తులు
సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు (T.Padhmarao Assets) కు రూ.4.19 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో చరాస్తుల విలువ 3.62 కోట్లు. వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాలు లేవు. 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అప్పులు రూ.50లక్షల వరకు ఉన్నాయి. ఆయన దగ్గర 60 తులాలు, ఆయన భార్య దగ్గర 75 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 17 కిలోల వెండి వస్తువులు కూడా ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ రూ.3.33 కోట్లుగా ఉంది.
బండి సంజయ్ ఆస్తుల వివరాలు
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ (Bandi sanjay kumar Assets) కుటుంబ ఆస్తుల విలువ 1.12 కోట్ల రూపాయలు. ఆయనకు స్థిరాస్తులు లేవు. సొంత ఇల్లు కూడా లేదట. అంతేకాదు.. బండి సంజయ్‌పై ఒకటి, రెండు కూడా మొత్తం 41 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన చరాస్తుల విలువ కోటి రూపాయలు. మూడు కార్లు, రెండు బైక్ ఉన్నాయి. ఆయన భార్యకి 43 తులాల బంగారం ఉంది. ఇక అప్పుల విషయానికి వస్తే... బండి సంజయ్ కుటుంబానికి అప్పులు రూ.13.4లక్షలుగా ఉన్నాయి. ఆయన... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చేశారు.
ధర్మపురి అర్వింద్ ఆస్తుల వివరాలు
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravindh Assets) పై 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.109 కోట్లు. చరాస్తుల విలువ రూ.59.9 కోట్లు కాగా... స్థిరాస్తుల విలువ రూ.49.8 కోట్లు. అరవింద్ పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు. ఆయన భార్య దగ్గర 85 తులాల బంగారం ఉంది. ఎక్కడా భూములు లేవు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాలు ఉన్నాయి. ఇక... అప్పులు రూ.30.66 కోట్లు ఉన్నాయి.
బాజిరెడ్డి ఆస్తుల విలువ
నిజామాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) కు రూ.4.61 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో 42.11 ఎకరాల వ్యవసాయ భూములు, వెయ్యి గజాల ఇంటి స్థలాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1.41 కోట్లు కాగా... స్థిరాస్తుల విలువ రూ.3.20 కోట్లు. అప్పులు లేవు. బాజిరెడ్డి కుటుంబ సభ్యులకు 100 తులాల బంగారం ఉంది.
అసదుద్దీన్ ఒవైసీ ఆస్తులు
హైదరాబాద్ ఎంపీగా పోటీచేస్తున్న MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin owaisi Assets) కి రూ.23.87 కోట్ల ఆస్తులున్నాయి. స్థిరాస్తుల విలువ రూ.20.91 కోట్లు కాగా... చరాస్తులు ఏమీ లేవు. ఆయన కుటుంబం పేరుతో వ్యవసాయ భూములు కూడా లేవు. పాతబస్తీ మిస్రీగంజ్, మైలార్‌దేవ్‌పల్లిల్లో ఇళ్లు ఉన్నాయి. అసదుద్దీన్ అప్పులు రూ.7.05 కోట్లు. ఆయన దగ్గర ఒక పిస్టల్, రైఫిల్ ఉన్నాయి. ఆయనపై 5 కేసులు ఉన్నాయి.
ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఆస్తులు
నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ (R.S. Praveen Kumar Assets) కుటుంబ ఆస్తులు రూ.1.41 కోట్లు. ఆయనపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సర్వీసు పింఛను వస్తుంది. చరాస్తుల విలువ రూ.73.39 లక్షలు. ప్రవీణ్‌కుమార్ దగ్గర ఐదు తులాల బంగారం, ఆయన భార్యకు 15 తులాలు, కుమారుడికి ఐదు తులాలు, కుమార్తెకు 15 తులాల బంగారం ఉంది. భూములు, వాణిజ్య భవనాలు లేవు. రూ.51.80 లక్షల అప్పులు ఉన్నాయి.
వినోద్‌రావు ఆస్తులు
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్‌రావు (Vinod rao Assets) ఆస్తులు రూ.16.25 కోట్లు. వినోద్‌రావు దంపతులకు 6.8 కిలోల బంగారం, 61.3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆయన చరాస్తుల వివుల రూ.9.95 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.6.30 కోట్లు. రూ.3.42 లక్షల అప్పులున్నాయి. కొత్తగూడెం, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో విలువైన వ్యవసాయ భూములు, మేడ్చల్‌లో వ్యవసాయేతర భూములు ఉన్నాయి.
బూర నర్సయ్యగౌడ్ ఆస్తుల వివరాలు
భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ (Boora Narasaiah Goud Assets) కుటుంబానికి 39 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో చరాస్తుల విలువ 9.1కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ 30 కోట్లు. ఆయనకు 3.22 కోట్ల అప్పులు ఉన్నాయి. 2.64 కిలోల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వ్యవసాయ భూములు, ప్లాట్లు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. అనేక సంస్థల్లో వాటాలు కూడా ఉన్నాయి.
గడ్డం వంశీకృష్ణ ఆస్తుల వివరాలు
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ (Gaddam vamsi krishana Asstes) ఆస్తులు రూ.24 కోట్లు. వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో 4.18 ఎకరాలు, ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 10.09 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. సొంతగా ఆయన పేరుతో ఇల్లు లేదు. అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయి.
కొప్పుల ఈశ్వర్ ఆస్తుల వివరాలు
పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar Assets) ఆస్తులు రూ.5.22 కోట్లు. ఇందులో చరాస్తుల విలువ రూ.3.59 కోట్లు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో ఇంటి స్థలాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.63 కోట్లు. అప్పులు రూ.2.3 కోట్లు. కొప్పుల ఈశ్వర దగ్గర 6 తులాల బంగారం, ఆయన భార్య దగ్గర 20 తులాల బంగారం ఉంది. కిలో వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.