Leaders Flocking To Chandrababu Residence: ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కలిసేందుకు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా ఆయన నివాసానికి క్యూ కట్టారు. అటు, ఉన్నతాధికారులు సైతం ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అటు, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చంద్రబాబుతో సుమారు అరగంట పాటు చర్చించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.


పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బాలకృష్ణ, కేశినేని చిన్ని, బొండా ఉమ, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, ధూళిపాళ్ల నరేంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జూలకంటి బ్రహ్మారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, బోడెప్రసాద్, అనగాని సత్యప్రసాద్ తదితరులు చంద్రబాబును కలిశారు.


ఢిల్లీకి చంద్రబాబు, పవన్


విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీయే సమావేశానికి వారు హాజరు కానున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు. 


Also Read: Chandrababu: 'సుదీర్ఘ యాత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు' - భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు, హిస్టారికల్ విక్టరీ అన్న చంద్రబాబు