Chandrababu Comments After Victory: తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తర్వాత బుధవారం నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విజయం చారిత్రాత్మకమని.. ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడూ చూడలేదని అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో చూశాం. ఎన్ని త్యాగాలు చేసైనా భావి తరాల భవిష్యత్ కోసం ముందుకెళ్లాం. విచ్చలవిడితనం, అహంకారంతో ఏం చేస్తామన్నా ప్రజలు క్షమించరు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పక్క ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఓట్లేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులను గెలిపించిన వారందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.


'లిఖించదగ్గ ఎన్నిక'


ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని చంద్రబాబు అన్నారు. 'ప్రజలు గెలవాలి.. రాష్ట్ర నిలబడాలి అనేదే మా ధ్యేయం. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పని చేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఐదేళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ఇంత చరిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి.' అని అన్నారు.


'పాలకులం కాదు.. సేవకులం'


తాము పాలకులుగా కాదని.. ప్రజలకు సేవకులుగా పని చేస్తామని చంద్రబాబు అన్నారు. 'అవినీతి, అరాచకాలతో పని చేస్తే ఇలాంటి గతి పడుతుంది. ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను (TDP Activists) చాలా ఇబ్బంది పెట్టారు. ప్రాణాలతో ఉండాలంటే 'జై జగన్' అని అనాలని హింసించారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన పరిస్థితిని చూశాం. మీడియా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలొంచుకునే ఘటనలు జరిగాయి. అధికారం ఉందని ఎవరినైనా.. ఏమైనా చెయ్యొచ్చని దాడులు చేశారు. విశాఖకు వెళ్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) వెనక్కు పంపించేశారు. గతంలో కరెంట్ సంక్షోభాన్ని గాడిలో పెట్టాం. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు మళ్లింది. కౌరవ సభను గౌరవ సభగా మార్చి మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో వెళ్తున్నాం. టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపునకు కృషి చేసిన పార్టీల కార్యకర్తలకు కృతజ్ఞతలు. సూపర్ సిక్స్ హామీలను, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేసి తీరుతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.'  అని చంద్రబాబు స్పష్టం చేశారు.


Also Read: Chandrababu: చంద్రబాబు నివాసానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు - ఉన్నతాధికారుల శుభాకాంక్షలు, దారులన్నీ అటువైపే!