తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. అయితే... కాంగ్రెస్ గ్యారెంటీల కంటే మిన్నగా ఉండేలా బీఆర్‌ఎస్ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రాబోతోందని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. అంతేకాదు.. మహిళ ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం హామీలు ఉంటాయన్నారు. ఆ హామీలు ఏంటో. త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఆ శుభవార్తను త్వరలోనే అందరూ వింటారని కూడా చెప్పారు మంత్రి హరీష్‌రావు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ప్రతిపక్షాల వ్యూహాలకు... ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధానమైన మేనిఫెస్టోపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో హామీ వర్షం కురిపించడంతో... ఆ హామీలకు ధీటుగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉండాలని భావిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవాలంటే... కొత్త పథకాలు, హామీలకు రూపకల్పన చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రజల కోసం ఎన్నో హామీలు ఉన్నాయంటూ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పదేపదే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రి హరీష్‌రావు.. త్వరలోనే మేనిఫెస్టో రాబోతోందని, అందులో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని చెప్పారు. దీంతో బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై ప్రజల్లో ఆసక్తి రేకెత్తించారు మంత్రి హరీష్‌రావు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని... వంట గ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో... మహిళలకు అంతు మించి ఏం చేయగలమన్న దానిపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు కూడా సమాచారం. గ్యాస్ సిలిండర్‌ను తక్కువ ధరకు ఇవ్వాలని భావిస్తుండగా, కాంగ్రెస్ చెప్పిన రూ.500 కంటే తక్కువకు ఇవ్వగలమా? అని కూడా నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చించన్నట్టు తెలుస్తోంది. ఇవి కాక మహిళలకు కొత్తగా ఎలాంటి పథకాలను అందించాలనే అంశంపైనా తీవ్రంగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వస్తే... బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. అయితే మంత్రి హరీష్‌రావు తాజా ప్రకటనతో బీఆర్‌ఎస్ మేనిఫెస్టో తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు కూడా రూపొందించినట్టు సమాచారం. అందుకే... త్వరలోనే మహిళలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పబోతున్నారని హింట్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. ఈ కార్యక్రమంలో మంత్రలుఉ మల్లారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ విద్యా వైద్యానికి పెద్దపీట వేశారని చెప్పారు హరీష్‌రావు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2వేల 850 మెడికల్ సీట్లు ఉంటే.... ఇప్పుడు 10వేల సీట్లు పెంచామన్నారు. గతంలో వైద్య విద్యార్థులు చదువుకోవాలంటే చైనా, ఉక్రెయిన్ లాంటి విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంబించామని చెప్పారు. దీని వల్ల పేదలకు వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రవేట్ వైద్య కళాశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు 50శాతం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి బాట పయనిస్తోంది... వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.