Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం, అభ్యర్థులపై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశానికి కొందు బీజేపీ నేతలు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల వ్యూహాలను రెడీ చేసుకునే సమావేశానికి ఆ నలుగురు నేతలు రాకపోవడంపై ఆసక్తి నెలకొంది.


నేతల డుమ్మా చర్చనీయాంశం


ఎన్నికల వేళ నిర్వహించే సమావేశానికి కొందుర నేతలు డుమ్మా కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ నలుగురు నేతలు కూడా పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ నలుగురే సోమువీర్రాజు, జీవీఎల్‌ నర్సింహరావు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్. ఈ నలుగురు కీలకమైన భేటీకి రాకపోవడం పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. 
కీలకమైన భేటీకీ ఆ నలుగురు ఎందుకు రాలేదనే విషయంపై ఏబీపీ దేశం ఆరా తీసింది. బీజేపీలో ఉండే ముఖ్య నాయకులతో మాట్లాడితే... సోమువీర్రాజుకు నాలుగు రోజుల నుంచి జ్వరం ఉందని.. ఆయన మంచినీళ్లు కూడా ముట్టడం లేదని పూర్తిగా నీరసంగా ఉన్నందునే సమావేశాలనికి రాలేదు. ఈ విషయాన్ని అధ్యక్షురాలు పురందేశ్వరికి సమాచారం ఇచ్చారు. మిగిలిన ముగ్గురు నేతలు ఎందుకు రాలేదో తమకు సమాచారం లేదు. వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు" అని చెప్పారు. 




కీలక వ్యాఖ్యలు చేసిన  పురందేశ్వరి


ఈ సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఏపీ చీఫ్‌ పురందేశ్వరి... వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి త్రివేణి సంగమం కలయిక అంటే మూడు పార్టీలు అవిరళ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేనతో పొత్తులో ఉన్నాం. టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. 




ప్రభుత్వ ఆస్తులు తనఖాతో పాలన 


పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశా వహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ హైకమాండ్ భావించింది. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుంది. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. అప్పులు భారీ ఎత్తున చేసేసింది ఈ ప్రభుత్వం. 
సెక్రటేరియట్‌ను, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా అని ఓ వైసీపీ నేత కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారు. 




ఇదే ఎస్సీ, ఎస్టీలకు చేసే న్యాయం 


నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్.. ఆ వర్గాలకు ఏం న్యాయం చేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల నిధులు దారి మళ్లించారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నారు. ఎస్సీలకు జగన్ చేసిన న్యాయం ఇదేనా..? ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకితమై పని చేస్తుంది. వైసీపీ నిరంకుశ పాలన చూస్తున్నాం. సీఎం జగన్ను గద్దె దించాలంటే మూడు పార్టీల కూటమి అనివార్యం. బీజేపీ అభ్యర్థులనే కాదు.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలి. మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒకటే. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం వస్తుంది. " అని శ్రేణులకు చెప్పుకొచ్చారు. ఈ సమావేశాల సందర్బంగా వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వ్యక్తులు బీజేపీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆహ్వానించారు.