Tirupati Assembly Constituency : తిరుపతిలో ఎన్నికల ప్రచారం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రచారం ముందు దైవ దర్శనం చేసుకుని... కలిసి వచ్చే ప్రాంతం నుంచి ప్రచారం చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. 


తండ్రి బాటలో తనయుడు... 
తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గత ఎన్నికల ముందు తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద పూజలు చేసి అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించారు. దానినే అనుకరిస్తూ తండ్రి బాటలో తనయుడు వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం అదే ప్రాంతం నుంచి ప్రచారం చేపట్టారు.


చిరంజీవికి కలిసొచ్చిన ప్రాంతం
ప్రజారాజ్యం పార్టీ ప్రారంభం అనంతరం తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరంజీవి జీవకోన ఆలయం వద్ద తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈశాన్య దిక్కున... పరమేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరి కూటమి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆరణి శ్రీనివాసులు చిరంజీవి  మార్గంలో వెళ్తున్నారు. చిరంజీవి సెంటిమెంట్ తాను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 27న ఉదయం 8.30 గంటలకు పరమేశ్వరుడుకు పూజలు చేసి జీవకోన ఆలయం వద్ద నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.


జీవకోనలో శ్రీ జీవలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో తిరుపతి నగర 5 డివిజన్ల కలుస్తుంది. తిరుపతి నగరంలో 2,80,351 ఓటర్లు ఉండగా జీవకోన ప్రాంతంలోనే 60వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని తిరుపతి నాయకులలో బలంగా నమ్ముతారు.