Kejriwal has a big task in the Delhi elections: ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఒక్క రాష్ట్రంలోనే ఎన్నికలు జరుపుతున్నారు కాబట్టి.. వేగంగా పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశారు. వచ్చే నెల ఐదో తేదీన పోలింగ్ జరుగుతుంది.. ఎనిమిదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల కన్నా ఆప్ అధినేత కేజ్రీవాల్‌కే విషమ పరీక్ష. తాను అవినీతి చేయలేదని నమ్మితేనే ఆప్‌కు ఓటేయండి..అలా అయితేనే సీఎం పీఠం మళ్లీ ఎక్కుతా అని ఆయన రాజీనామా చేసి రాజకీయాలు చేస్తున్నారు. 


అవినీతి వ్యతిరేకత ఉద్యమం నుంచి వచ్చిన లీడర్ కేజ్రీవాల్ 


అవినీతి వ్యతిరేకత ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన లీడర్ అయిన కేజ్రీవాల్.. అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఆయన ఇమేజ్ మసకబారింది. ఆయనపై బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడిందని ఢిల్లీ జనం నమ్మితే ఆయన బయటపడతారు. ఇప్పటికే గత మూడు సార్లు ఆప్ గెలిచింది. మొదటి సారి బొటాబొటి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక రాజీనామా చేసిన ఆయన తర్వాత రాజీనామా చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పి బంపర్ మెజార్టీలతో రెండు సార్లు గెలిచారు. అప్పట్లో మరోసారి రాజీనామా చేయనని ప్రజలకు వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామా వ్యూహం అమలు చేశారు.  డిల్లీ లిక్కర్ స్కాం ఇప్పుడల్లా తేలదని అందుకే పదవికి రాజీనామా ప్రజల వద్దకు వెళ్తున్నానని కేజ్రీవాల్ అంటున్నారు. ప్రజాకోర్టులో తాను గెలిస్తే అటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే తనకు క్లీన్ చిట్ వచ్చినట్లుగా తీర్మానించుకుని మళ్లీ సీఎం పదవి చేపడతారు. ఇక్కడే ఆయన అసలైన రాజకీయ వ్యూహం ఉందని అనుకోవచ్చు. 


పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా 


  ఈ వ్యూహం ఎంత వరకు వర్కవుట్ అవుుందనేది కూడా సందేహమే.ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుండి ఢిల్లీ .. ఆ పార్టీ చేతుల్లోనే ఉంది. సరైన అధికారాలు లేని ప్రభుత్వమే అయినా తమ పరిధిలో ఉన్న విషయాల్లో కీలకమైన ప్రగతిని చూపించడంతో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం గడుతున్నారు. కానీ పార్లమెంట్ కు వచ్చే సరికి మొత్తం.. బీజేపీకే సీట్లు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ డిల్లీలో ఒక్క సీటు కూడా కూటమికి రాలేదు.  కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసినా ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడు ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి. ఎన్నికల్లో తేడా వస్తే కేజ్రీవాల్ ను అవినీతిపరుడుగా ప్రజలు గుర్తించారని విపక్షాలు తేల్చేస్తాయి. కేజ్రీవాల్ కూడా కాదనలేరు. ఎందుకంటే ఆనయ ఎన్నికలకు వెళ్తున్న నినాదం అదే మరి.  ఒక వేళ గెలిస్తే..  కేజ్రీవాల్ .. తనను ప్రజలు నిర్దోషిగా తీర్పు ఇచ్చారని ప్రకటించుకుంటారు. లేకపోతే ఆయన రాజకీయ  భవిష్యత్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.  


గెలుపోటముల ప్రభావం బీజేపీ, కాంగ్రెస్‌లపై తక్కువే 


మొత్తం 70 సీట్ల తెలంగాణ అసెంబ్లీలో గెలుపోటములు జాతీయ పార్టీలపై పెద్దగా ప్రభావం చూపించవు.  కాంగ్రెస్ పది సీట్లు సాధించినా ఎంతో మెరుగుపడినట్లు అవుతుంది. షీలాదీక్షిత్ సీఎం పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ కు ఢిల్లీలో అడ్రస్ కరవయింది.  బీజేపీ గెలవకపోతే  ఆ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసింది. పైగా లెఫ్టినెంట్ జనరల్  ద్వారా పరిపాలన బీజేపీనే చేస్తుంది.  కానీ కేజ్రీవాల్ పరిస్థితి అది కాదు. ఢిల్లీలో ఓడిపోతే.. మొత్తం పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. జాతీయ పార్టీ హోదా కూడా పోతుంది. అందుకే ఢిల్లీ ఎన్నికలు ఆయనకే పెను సవాల్ గా మారాయని అనుకోవచ్చు. 



Also Read: KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు