NTR News: కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గుడివాడ(Gudivada Assembly Constituency) అసెంబ్లీ ఎంతో కీలకమైన నియోజకవర్గం. తెలుగువాడి కీర్తి ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన నియోజకవ‌ర్గం. కమ్యూనిస్టుల ఖాతాలో ఉన్న ఈ నియోజకవర్గంపై తొలుత కాంగ్రెస్(Congress) పాగా వేయగా...తెలుగుదేశం(Telugudesam) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. గత రెండు దఫాలుగా వైసీపీ(YCP) గెలుస్తూ వస్తోంది.

గుడివాడపై గురి
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా తెలుగుదేశం(Telugudesam) అభిమానులు ఎదురుచూస్తున్న మరో ఫలితం గుడివాడ(Gudiwada). తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి వెళ్లి వైసీపీలో చేరిన కొడాలి నాని వరుసగా రెండుసార్లు గెలిచారు. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగే...కొడాలినానిని ఈసారి గుడివాడలో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం నాలుగేళ్ల క్రితమే ప్రణాళికలు రచించింది...గెలుపు గుర్రాన్ని సిద్ధం చేసింది. అసలు నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇక్కడ ఎవరెవరు గెలిచారో ఒకసారి చూద్దాం..

కమ్యూనిస్టుల కోట
1952లో ఏర్పడిన గుడివాడ నియోజకవర్గంలో తొలుత కమ్యునిస్టుల ప్రభావం ఉండేది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై సీపీఐ(CPI) అభ్యర్థి గుంజి రామారావు విజయం సాధించారు. ఏడాదికే జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఐ నుంచి కాట్రగడ్డ రాజగోపాల్రావు గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ నుచి వేముల కూర్మయ్య విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సీపీఐ నుంచి గుంజి రామారావు జయకేతనం ఎగురవేశారు. 1967లోజరిగిన ఎన్నికల్లో ఎం.కె. దేవి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం(CPM) అభ్యర్థి వెంకట సుబ్బారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కఠారి సత్యనారాయణరావు విజయం సాధించారు. 1978లోనూ మళ్లీ వీరివురు పోటీపడగా...మళ్లీ కఠారినే గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తన సొంత నియోజకవర్గామైన గుడివాడ నుంచి నందమూరి తారకరామారావు(Nandamuri Tarakaramarao) భారీ మెజార్టీతో విజయం సాధించారు.

1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గుడివాడ నుంచి మరోసారి ఎన్టీఆర్ పోటీ చేయగా...ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పలపాటి సూర్యనారాయణబాబు నిల్చున్నారు. రెండోసారి గుడివాడ నుంచి ఎన్టీఆర్ విజయం సాధిచారు. ఎన్టీఆరో రెండుచోట్ల నుంచి విజయం సాధించడంతో గుడివాడలో రాజీనామా చేయగా...రావిశోభనాద్రి చౌదరి తెలుగుదేశం నుంచి గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి రావి శోభనాద్రిచౌదరి(Raavi Sobhanadri Chowdary)పై కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్‌కుమార్(Katari Eswar) కేవలం 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

1994లో జరిగిన ఎన్నికల్లో మరోసారి వీరిద్దరే పోటీపడగా..ఈసారి తెలుగుదేశం అభ్యర్థి రావి శోభనాద్రి చౌదరి గెలుపొందారు.1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి రావి హరిగోపాల్(Raavi Harigopal) పోటీచేయగా...కాంగ్రెస్ నుంచి శేగు వెంకటేశ్వర్లు(Segu Venkateswarlu) పోటీలో నిల్చున్నారు. మరోసారి తెలుగుదేశాన్ని విజయం వరించింది. రోడ్డు ప్రమాదంలో హరిగోపాల్ మృతిచెందగా ఉపఎన్నికల్లో ఆయన సోదరుడు రావి వెంకటేశ్వరరావు(Raavi Venkatewararo) విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కొడాలి నాని(Kodali Nani), కాంగ్రెస్ నుంచి కఠారి ఈశ్వర్‌కుమార్ పోటీ చేయగా...నాని విజయం సాధించారు.

2009లోనూ గుడివాడ నుంచి తెలుగుదేశం  అభ్యర్థిగా కొడాలి నాని కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. ఆ తర్వాత కొడాలి నాని వైసీపీ(YCP)లో చేరారు. 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రావివెంకటేశ్వర్రావుపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరఫున కొడాలినాని పోటీ చేయగా...తెలుగుదేశం నుంచి దేవినేని అవినాష్(Devineni Avinash) పోటీపడ్డారు. వరసగా నాల్గవసారి కొడాలి నాని గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ తరపున పోటీకి సిద్ధం కాగా...తెలుగుదేశం పార్టీ ఎన్నారై  వెనిగండ్ల రాము(Venigandla Ramu)కు టిక్కెట్ ఇచ్చింది. ఈసారి గుడివాడలో పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది.

గుడివాడలో ఎప్పుడు ఎవరు విజయం సాధించారు?

ఎవరు ఎప్పుడు  పార్టీ
గుంజి రామారావు 1952 సీపీఐ
కాట్రగడ్డ రాజగోపాల్రావు 1953 సీపీఐ
వేముల కూర్మయ్య 1955 కాంగ్రెస్
గుంజి రామారావు 1962 సీపీఐ
ఎం.కె. దే 1967 కాంగ్రెస్
కఠారి సత్యనారాయణరావు . 1972 కాంగ్రెస్
కఠారి సత్యనారాయణరావు 1978 కాంగ్రెస్
ఎన్టీఆర్ 1983 టీడీపీ
ఎన్టీఆర్ 1985 తెలుగుదేశం
రావి శోభనాద్రి 1985 తెలుగుదేశం
కఠారి ఈశ్వర్‌కుమార్ 1989 కాంగ్రెస్
రావి శోభనాద్రి 1994 తెలుగుదేశం
రావి హర గోపాల్ 1999 టీడీపీ 
రావి వెంకటేశ్వరరావు  2000 టీడీపీ 
కొడాలి వెంకటేశ్వరరావు(నాని) 2004 టీడీపీ 
కొడాలి వెంకటేశ్వరరావు(నాని) 2009 టీడీపీ 
కొడాలి వెంకటేశ్వరరావు(నాని) 2014 వైఎస్‌ఆర్ కాంగ్రెస్
కొడాలి వెంకటేశ్వరరావు(నాని) 2019 వైఎస్‌ఆర్ కాంగ్రెస్