Lok Sabha Elections 2024 First Phase Notification: ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. లెజిస్లేటివ్ కౌన్సెల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో ఇవాళ (బుధవారం) ఉదయం ఒక గెజిట్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌తో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలివిడతలో భాగంగా... 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని... 102 ఎంపీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లేనని ఈసీ ప్రకటించింది. తొలి నోటిఫికేషన్‌కు సంబంధించి... ఇవాళ్టి (మార్చి 20వ తేదీ) నుంచి ఈనెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 30 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుంది.ఫలితాలు జూన్ 4వ తేదీన అన్ని దశల ఎన్నికల ఫలితాలతో పాటే విడుదల కానున్నాయి.
తొలి విడత ఎన్నికలు ఎక్కడెక్కడ..?
తొలివిడతలో.. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని... 102 ఎంపీ స్థానాలకు జరుగుతున్నాయి. వీటిలో... తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8 స్థానాలకు తొలివిడతలో పోలింగ్ జరగనుంది. అలాగే మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్రలో ఐదు, ఉత్తరాఖండ్‌లో ఐదు, అసోంలోని ఐదు స్థానాలు కూడా తొలివిడతలోనే ఎన్నికల జరుగుతున్నాయి. ఇక... బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు, మణిపుర్‌లో రెండు, మేఘాలయలలో రెండు స్థానాలకు కూడా ఫస్ట్ ఫేజ్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. చివరగా... ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానానికి తొలివిడతలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలు.. సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా(ఎస్సీ), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ లోకసభ స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు.... ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 44 రోజులపాటు పోలింగ్ జరగబోతోంది.
దేశంలో ఎన్నికల సందడి
తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో... దేశంలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది..మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలిదశ పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ విడుదలకావడంతోపాటు... నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకావడంతో... దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కనిపించనుంది. 1951-52లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం కూడా ఒక ప్రత్యేకత. 102 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్ రావడంతో... ఆయా ప్రాంతాల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లె సీఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు కూడా మే 13నే ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.