Elections 2024: మ‌రో 15 నుంచి 20 రోజుల్లోనే లోక్‌స‌భ ఎన్నిక‌ల(Lok sabhaElections)కు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుద‌ల కానుందా?  అంటే.. ఔన‌నే అంటున్నాయి జాతీయ మీడియా వ‌ర్గాలు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే ప‌ర్య‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్లు.. అన్ని రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితుల‌పై ఒక అంచ‌నాకు వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో జాతీయ‌స్థాయిలో ఓట‌ర్ల జాబితాను కూడా ఇటీవ‌ల ఇచ్చేశారు. దేశంలో 98 కోట్ల మందిఓట‌ర్లు ఉన్నార‌ని లెక్క తేల్చారు. ఇక‌, రాష్ట్రాల డీజీపీలు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తోనూ క‌మిష‌న‌ర్లు భేటీ అయ్యారు. వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. 


మొత్తంగా సార్వత్రిక ఎన్నికల స‌మ‌రంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Elections Commission) పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తును పూర్తి చేసింది. ఇదే విష‌యాన్ని నాలుగు రోజుల కింద‌ట కేంద్ర ఎన్నిక‌ల సంఘంప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్(Rajiv kumar) మీడియాకు సైతం వెల్ల‌డించారు. కసరత్తు దాదాపు పూర్తయినట్లు ఆయ‌న తెలిపారు. దేశంలో ఒకే స‌మ‌యంలో పార్ల‌మెంటుకు, అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల శాస‌న స‌భ‌ల ప‌ద‌వీ కాలంఈ ఏడాది మేతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది.


రాజకీయ పార్టీలు (Political parties), స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తాజాగా ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న‌ సమాచారం.  అన్నీ ఓకే అనుకుంటే.. మార్చి 9వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నికల తొలుత షెడ్యూల్‌ను త‌ర్వాత‌.. నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 


ఎక్క‌డెక్క‌డ‌?


దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh), ఒడిశా(Odisha), అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachalpradesh), సిక్కిం(Sikkim) అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కొన్నాళ్ల కింద‌ట సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ రాష్ట్రంలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. ప్రాధ‌మిక అంచ‌నా ప్ర‌కారం..  మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో భార‌త ఎన్నిక‌ల సంఘం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారి ఎన్నిక‌లు జ‌రుగుతున్న జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై చర్చించనున్నారని స‌మాచారం. ఆ తర్వాత మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుంది. లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. 


2019లో ఎప్పుడు జ‌రిగాయి?


2019లో జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప‌రిశీలిస్తే.. 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు దేశ‌వ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌, బీజేపీ ఇప్ప‌టికే 370 స్థానాల్లోగెలుపు గుర్రం ఎక్కాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి కాంగ్రెస్ ఏం చేస్తుంద‌నేదిచూడాలి. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. పొత్తులు - ఎత్తులు ఇంకా కొలిక్కి రాలేదు. మ‌రోవైపు.. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య రాజ‌కీయం మాత్రం ర‌ణ‌రంగంగా మారే ప‌రిస్థితులు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.