TDP Leaders Joins To YSRCP: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరన్న మాట ఎంత నిజమో. అదే రాజకీయ నాయకులకు శాశ్వత పార్టీలు ఉండవు అన్నద కూడా అంతే నిజంగా ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకప్పుడు నేతలు విలువలు, సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేసేవారు. ఏ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేశారో.. తుది వరకు అదే పార్టీలో ఉండేవారు. ఇప్పటికీ అటువంటి నేతలు కొందరు ఉన్నారు. అత్యధిక నేతలు మాత్రం అవకాశాలు, అవసరాలు ప్రామాణికంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ అవకాశం ఇస్తే అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అప్పటి వరకు ఉన్న పార్టీలో టికెట్లు రాలేదోనో, నచ్చిన స్థానాన్ని కేటాయించలేదో అన్న కారణంతో చాలా మంది నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీలో ఈ వ్యవహారం ఎక్కువగా కనిపిస్తోంది. టికెట్లు రాకపోవడంతో చాలా మంది నేతలు పార్టీ వీడుతూ వచ్చారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారం వైసీపీని టెన్షన్‌ పెడుతూ వచ్చింది. ఇప్పుడు సీట్ల ప్రకటనకు సిద్ధం అవుతున్న టీడీపీని కూడా జంపింగ్‌ జపాంగ్‌లు ఆందోళనకు గురి చేస్తున్నారు. 


వైసీపీలోకి వెళ్లే నేతలెవరో


టీడీపీలో ఏళ్ల నుంచి ఉన్న ఎంతో మంది నేతలు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా పలువురు నేతలు చేరగా, మరింత మంది సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన టీడీపీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. ఈ పరిణామం టీడీపీకి షాక్‌ అనే చెప్పాలి. టీడీపీ నూజివీడు ఇన్‌చార్జ్‌గా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి ఖరారు చేశారన్న ప్రచారం ఉంది. నూజివీడులో ఆయన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వెంకటేశ్వరరావు కొద్దిరోజులు కిందట నిర్వహించిన సమావేశంలో బోరున విలపించారు. చంద్రబాబు టికెట్‌ కేటాయిస్తారన్న ఆశ లేకపోవడంతో ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేతను ఆయన కలిసినట్టు చెబుతున్నారు. ఈయనతోపాటు అనేక జిల్లాల్లో టికెట్లు రాని నేతలంతా ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. తాజాగా రాయచోటిలో రమేష్‌ రెడ్డి తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయనకు టికెట్‌ ఇవ్వరన్న ప్రచారం నేపథ్యంలో అనుచరులతో భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. చంద్రబాబు ఫొటో, టీడీపీ జెండాలు లేకుండానే సమావేశాన్ని నిర్వహించారు. ఈయన ఎటువైపు అడుగులు వేస్తారన్న ఆసక్తి నెలకొంది. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు తేలితే సీట్లపై స్పష్టత వస్తుంది. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వస్తే.. ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంది. వారంతా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం రాజకీయంగా పెనుమార్పులకు కారణం కావచ్చని చెబుతున్నారు. 


కూటమికి తప్పని ఇబ్బందులు


ప్రస్తుతం సీట్ల పంపకాలతో వైసీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పోలిస్తే కూటమి పార్టీకి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గరు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి సీటు ఇచ్చినా.. మిగిలిన నేతలు అలకబూనే చాన్స్‌ ఉంది. అటువంటి వారంతా పార్టీ మారేందుకు వెనుకాడరు. ఈ ఇబ్బందులు, అలకలను సంతృప్తిపరచడం ఆయా పార్టీల నేతలకు తలకుమించి సమస్యగా మారనుంది. ఇదే ఇప్పుడు ఆయా పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. పొత్తు తేలి సీట్ల పంపకాలు పూర్తయిన తరువాత కూటమి పార్టీలోని నేతలకు అసలు తలనొప్పి ప్రారంభమయ్యే అవకాశముందని చెబుతున్నారు.