EC Imposed Ban On Firecrackers And Rallies :ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల అనంతరం మూడు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగాయి. హత్యాయత్నాలు, ఈవీఎంల ధ్వంసం, ప్రత్యర్థులపై దాడులతో మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి దద్దరిల్లిపోయింది. ఈ దాడులను అదుపు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. 


ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఇంకా అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా ఎన్నికల సంఘానికి సమాచారం ఉంది. ఈ మూడు ప్రాంతాలతోపాటు ఇంకా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇచ్చింది. దీంతో మరింత అప్రమత్తంగా ఉంటోన్న ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 


లోక్‌ సభ ఎన్నికల లెక్కింపు జూన్ నాలుగున జరగనుంది. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా ఎన్నికల సంఘం భారీగా బలగాలను మోహరించడంతోపాటు మరికొన్ని ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించింది. వాటితోపాటు బాణసంచా విక్రయాలపై కూడా ఆంక్షలు పెట్టింది. 


రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్న ఎన్నికల సంఘం ఇప్పటికే గొడవలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగిస్తోంది. చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి పోలీసు నిఘాలో ఉంది. 


ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అతిక్రమించే వాళ్లు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. 


వచ్చే నెల ఆరో తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తయారీదారులు, అమ్మకందారులు కూడా జాగ్రత్తాగ ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పార్టీలతోపాటు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఆదేశాలను అల్లఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 436 కింద కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.