Election Transfers In Andhra Pradesh: ఆంధప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా.. రాష్ట్ర ఎన్నికల అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(CEC). లోక్‌సభ(Lok Sabha), అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections ) నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే స్థానంలో మూడేళ్లు పూర్తి చేసిన అధికారులకు బదిలీలు చేయాలంటూ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెలాఖరుకల్లా బదిలీలు, పోస్టింగ్‌ల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మూడేళ్లు ఒకేచోట, ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆ ఉత్తర్వుల మేరకు.. సంబంధిత శాఖాధిపతులు, కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకుని... నెలాఖరులోగా బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు.
మూడేళ్లు పూర్తైన వారు బదిలీ
నాలుగేళ్ల పూర్తయిన వారికి, జూన్ 30 నాటికి మూడేళ్లు పూర్తయిన వారిని కూడా బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈసీ. స్థానికంగా జిల్లాకు చెందిన అధికారులను.... వేరే జిల్లాకు బదిలీ చేయాలని తెలిపింది. స్థానికంగా మండల స్థాయి అధికారులు కూడా గుర్తించి మూడేళ్ల పూర్తయిన వారిని బదిలీ చేయాలని సూచించింది. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్య తదితర శాఖలకు చెందిన అధికారులకు మొదటి ప్రాధానం ఇస్తూ బదిలీలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా శాఖల అధికారులు టెన్షన్ పడుతున్నారు. తమకు ఎక్కడికి బదిలీ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
సొంత జిల్లాకు నో పర్మిషన్
ఎన్నికల విధులు పాల్గొంటున్న ఏ అధికారిని కూడా సొంత జిల్లాలో కొనసాగించడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది. జిల్లా అధికారులతో పాటు నిర్దిష్టంగా ఎన్నికల విధులకు నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు, ఉపఎన్నికల అధికారులు, ఏఆర్‌వోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, నోడల్ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులతో సహా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ బదిలీల నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్, డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఈసీ.
ఖాకీలకు సేమ్ రూల్స్
పోలీసుశాఖకు కూడా బదిలీ నిబంధనలు వర్తిస్తాయని... అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, రాష్ట్ర ఆర్మ్‌డ్ పోలీసులు, ఎస్‌ఎస్‌పీలు, ఎస్‌పీలు, అదనపు ఎస్‌పీలు, సబ్ డివిజనల్ హెడ్ ఆఫ్ పోలీసు, ఎస్‌హెచ్‌వోలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, జిల్లాస్థాయిలో ఎన్నికల బందోబస్తుకు ఉపయోగించే పోలీసు బలగాల్లో కూడా బదిలీ చేపట్టాలని తెలిపింది. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లను వారి స్వంత జిల్లాలో నియమించకూడదని చెప్పింది. ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నాలుగేళ్లలో 3 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తిచేస్తే... మరో పోలీసు సబ్ డివిజన్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. ఆ సబ్ డివిజన్ అంతకుముందు పనిచేసిన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండకూడదని కూడా కండిషన్ పెట్టింది ఈసీ. లేదంటే మరో జిల్లాకు బదిలీ చేయాలని సూచించింది. ఇక... ఎక్సైజ్ అధికారులకు కూడా బదిలీ నిబంధనలు వర్తిసాయి. సబ్ ఇన్‌స్పెక్టర్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న రాష్ట్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా బదిలీల చేయనున్నారు.
వీళ్లకు మినహాయింపు
ఎన్నికలతో నేరుగా సంబంధం లేని వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మాత్రం బదిలీలు ఉండవు. అయితే వారిలో ఎవరైనా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే.. విచారణ నిర్వహిస్తారు. విచారణలో ఆరోపణలు రుజువైతే.. అలాంటి అధికారిని బదిలీ చేయమని ఆదేశించడంతోపాటు శాఖాపరమైన చర్యలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేయనుంది. అలాగే... గతంలో క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి పెండింగ్‌లో ఉన్న అధికారులకు కూడా ఎన్నికల విధులు అప్పగించ వద్దని ఆదేశించింది ఈసీ. అంతేకాదు... గతంలో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని తేల్చి చెప్పింది.
అధికారిక పనితీరుకు సంబంధించిన క్రిమినల్ కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే... అలాంటి అధికారులు కూడా ఎన్నికల విధుల్లో ఉండకూడదని తెలిపింది ఈసీ. ఇక.. ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులు ఎవరైనా ఎన్నికల సంబంధిత పోస్టులో ఉంటే ఆ వ్యక్తిని విధుల నుంచి తప్పించాలని తెలిపింది. అలాంటి వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పదవీ విరమణ తరువాత వివిధ హోదాల్లో తిరిగి నియమించిన, పొడిగింపులపై ఉన్న అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా... ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ దగ్గర బంధువు కాదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ అధికారి అయినా తప్పుడు సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది ఈసీ.