Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ రేపు (జూన్ 5) ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి సమావేశంలో పవన్, చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అన్నీ కలిపి 280కి పైబడి స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ 400 స్థానాలు అంటూ ప్రచార సమయంలో ఊహించినప్పటికీ బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గినట్లుగా తాజా ఫలితాలను బట్టి అర్థం అవుతోంది.


అందుకే ఎన్డీఏలో ఉన్న పార్టీలనే కాక, ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కూటమిలో చేర్చుకొని బలం పెంచుకోవాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏకు కన్వీనర్ గా చంద్రబాబును నియమించాలని కూడా బీజేపీ పెద్దలు భావించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని.. చంద్రబాబును ఫోన్ ద్వారా కోరగా.. తాను ఆలోచించి చెబుతానని 48 గంటలు సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.


ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉండడం ద్వారా కూటమిలోకి ఇతర పార్టీలను చేర్చుకోవడంలో బాబు అనుభవం పనికివస్తుందని అంటున్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నవారు ఉంటే ఎన్డీఏ కూటమికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. పైగా అటు I.N.D.I.A కూటమి కూడా 230కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. ఇతరులు మరో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో ఎన్డీఏ కూటమి ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ బీజేపీ సొంతంగా 300కు పైచిలుకు స్థానాలు గెలిచి ఉంటే ప్రాంతీయ పార్టీలకు అంత విలువ ఇవ్వకపోయేవారు కాదని విశ్లేషణలు వస్తున్నాయి. మెజారిటీకి కాస్త ఎక్కువగా మాత్రమే ఎన్డీఏ కూటమి సీట్లు కైవసం చేసుకోవడంతో.. మరింత బలం పెంచుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాక, కూటమిలోనూ కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు చెబుతున్నారు.