Karnataka Election News :  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ నియోజక వర్గాల పరిశీలకులుగా తెలుగు రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి ఐదుగుర్ని ఎంపిక చేసింది.  ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్‌లు ఉన్నారు.. ఈ నేత‌లు వారికి కేటాయించిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్ ప్ర‌చార బాధ్య‌త‌ల‌తో పాటు ఇత‌ర అంశాల‌ను కూడా ప‌రిశీలించి ఎప్ప‌టిక‌ప్పుడు అధిష్టానానికి తెలీయ‌జేస్తారు. ఏపీకి చెందిన ఇద్దర్ని కూడా నియమించారు.  బెంగళూరు పరిశీలకుడిగా రఘువీరారెడ్డి, మరో ప్రాంతానికి  శైలజానాథ్ ను నియమించారు. వీరిద్దరూ కర్ణాటక సరిహద్దు రాష్ట్రమైన అనంతపురం జిల్లాకు చెందినవారు. కర్ణాటకలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. 


కర్ణాటక ఎన్నికలపై తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే   కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది.  కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ తో రేవంత్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన కర్ణాటకలో సీఎం అయితే ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ సింపుల్‌గా చేయవచ్చని రేవంత్ రెడ్డి  భావిస్తున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్న కేసీఆర్ ను  కాన్ఫిడెన్షియల్ ఇన్ పుట్స్ తో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల  కర్ణాటక కాంగ్రెస్‌ కీలక నేత శివకుమార్‌తో కీలక సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ప్రచారం ప్లాన్ ను రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.  


 రేవంత్‌తో సహా అగ్రనేతలు ఈ నెల 20 తర్వాత కర్ణాటకకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రచారంలో పాల్గొనే వారి పేర్లను నమోదు చేసుకోవాలని రేవంత్‌ కోరడంతో వంద మందికి పైగా ఆసక్తి కనబరిచినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా 8వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది.  కనీసం రెండు వారాల పాటు తెలంగాణ నేతలు కర్ణాటకలో మకాం వేసే అవకాశం ఉంది.  భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికలు అత్యంత కీలకం.  అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అవుతుంది.  అక్కడ అధికారాన్ని పోగొట్టుకుంటే... మొదటికే మోసం వస్తుంది. అందుకే తెలంగాణ నేతలు కూడా కర్ణాటకలో గెలవడానికి తమ వంతు ప్రచార సాయం చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు.   
 


కర్ణాటక ఎన్నికలపై ఇప్పటి వరకూ పెద్దగా మాట్లాడని బీఆర్ఎస్ ... జేడీఎస్ కు మద్దతుగా విస్తృత ప్రచారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. తమ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధినేత కుమారస్వామి సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించారు.  రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న రాయచూర్‌, గుల్భర్గా, బీదర్‌, గంగావతి, కొప్పోల్‌తో సహా తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలు, నియోజక వర్గాల్లో జరిపే ఎన్నికల బహిరంగ సభల్లో కుమారస్వామితో కలిసి వేదిక పంచుకోవా లని, బెంగళూరు మహానగరంలో నిర్వహించే ప్రచార కార్య క్రమాలు రోడ్‌ షోలలో భాగస్వామ్యం కావాలని నిర్ణయిం చినట్టుచెబుతున్నారు.