BSP Manifesto News:  ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుండగా.. సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసి ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే.. ప్రజల్ని ఆకర్షించటానికి హారాహోరీగా పథకాల రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. ఇక బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. బీఎస్పీ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఇవాళ విడుదల చేశారు. 10 పథకాలతో బీఎస్‌పీ మేనిఫెస్టో విడుదలయ్యింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా BSP మేనిఫెస్టో విడుదల చేశారు.


సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో


 తెలంగాణలో రాజకీయ హడావుడి జోరందుకుంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు తొలి జాబితాను విడుదల చేసి, ప్రచారం కూడా మొదలు పెట్టాయి.  ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను పార్టీ ప్రకటించింది.  బీఎస్‌పీ మేనిఫెస్టోలో విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కాగా, తెలంగాణలో ఐపీఎస్‌గా సేవలందించిన  ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ప్రవీణ్ కుమార్ ఈ ఎన్నికల్లో సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.


ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల తో పాటు, ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ అందిస్తామని బీఎస్పీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందిక. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు అయిదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ పది లక్షల ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.


ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఏడాది మండలానికి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం రూ.25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. భీమ్ రక్షా కేంద్రాల కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్య అందిస్తామన్నారు.


బీఎస్పీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..


1 .కాన్షి యువ సర్కార్ పథకం కింద యువతకు అయిదు ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. అందులో మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు.


2. బహుజన రైతు ధీమా కింద  ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు, రైతులకు విత్తనం నుండి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ, ధరణి పోర్టల్ రద్దు చేస్తాము.


3. దొడ్డి కొమురయ్య భూమి హక్కు పథకం కింద భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 1ఎకరం భూమి, మహిళలపేరిట పట్టా.


4. చాకలి ఐలమ్మ మహిళ జ్యోతి పథకం కింద మహిళ కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణ, అంగన్వాడీ, ఆశ వర్కర్ల ఉద్యోగుల క్రమబద్ధీకరణ. మహిళ సంఘాలకు ఏటా ఒక లక్ష రూపాయలు.


5. బీమ్ రక్ష కేంద్రాలు కింద వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం, రక్ష కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.


6. పూలే విద్యా దీవెన పథకం కింద మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశి విద్య డాట, A1 కోడింగ్ లో శిక్షణ.


7. బ్లూ జాబ్ కార్డు పథకం కింద పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలీ 350 ఇస్తాము, కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా.


8. నూరేళ్ళ ఆరోగ్య ధీమా పథకం కింద ప్రతి కుటుంభానికి 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజ్. ఏటా 25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్.


9. వలస కార్మికుల సంక్షేమ నిధి పథకం కింద 5 వేల  కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి, గిగ్ కార్మికులు లారి, ట్యాక్సీ డ్రైవర్ లకు 600 సబ్సిడీ క్యాంటీన్ లు.


10. షేక్ బందగీ గృహ బరోసా పథకం కింద ఇళ్లు లేని వారికి 550 గజాల ఇంటి స్థలం ఇళ్లు కట్టుకునే వారికి 6 లక్షల సహాయం. ఇంటి పునర్మిరానికి 1.5 లక్షల సహాయం.