ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎక్కడ చూసినా హడావుడే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కు, ఓటరు కార్డు సవరణలు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అయితే, ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ ఐడీ చాలా కీలకం. చాలా మందికి ఓటు వేసే సమయంలోనే ఓటర్ ఐడీ గుర్తొస్తుంది. ఒక్కోసారి అది కనిపించకుండా పోవచ్చు లేదా పూర్తిగా పాడైపోవచ్చు. అలాంటి సమయంలో డూప్లికేట్ ఓటర్ ఐడీ పొందేలా ఈసీ వెసులుబాటు కల్పించింది. దీన్నీ ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.


ఆన్ లైన్ లో డౌన్ లోడ్ ఇలా



  • తొలుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిక వెబ్ సైట్ https://voters.eci.gov.in ను సందర్శించాలి. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే దీని కోసం వినియోగించాల్సి ఉంటుంది. 

  • e-epic విభాగంలో నిర్ధారిత ప్రాంతంలోకి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. 

  • మీరు ఏ మొబైల్ నెంబర్ నమోదు చేశారో, ఆ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్ లోడ్ అవుతుంది. ఈసీ పంపే కార్డు కోసం ఎదురు చూడకుండా ఇలా ఆన్ లైన్ లోనే సులువుగా మీ ఓటరు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


గతంలోనూ ఈ సదుపాయం ఉన్నప్పటికీ దాని ఆమోదానికి అధిక సమయం పట్టేది. సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారి వివరాలను ఆమోదించిన తర్వాతే ఈ ప్రక్రియ పూర్తయ్యేది. తాజాగా, ఈ ప్రక్రియను సులభతరం చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.


ఆన్ లైన్ లో డూప్లికేట్ ఓటరు ఐడీ కోసం 



  • https://voters.eci.gov.in లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాలి. డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డు కోసం ఫాం EPIC-002 కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ ఫాంను పూరించి అన్ని పత్రాలు అటాచ్ చేయాలి.

  • ఓటర్ ఐడీ పోయినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ (ఎఫ్ఐఆర్), అడ్రస్, గుర్తింపు పత్రాలను జత చేయాలి.

  • ఈ ఫాంను స్థానిక ఎన్నికల కార్యాలయానికి సమర్పించాలి. అనంతరం మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా ఈసీ వెబ్ సైట్ లో మీ దరఖాస్తు స్టేటస్ ట్రాక్ చెయ్యొచ్చు.

  • మీ దరఖాస్తు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైతే కార్డు జారీ అయినట్లు మీకు సందేశం వస్తుంది. 


ఆఫ్ లైన్ లో డూప్లికేట్ ఓటరు ఐడీ కోసం



  • ముందుగా ఓటర్ ఐడీ కార్డు పోయినట్లు పోలీసులకు తెలిపి ఆ FIR కాపీని మీ వద్ద ఉంచుకోవాలి. అనంతరం సమీపంలో ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించాలి.

  • డూప్లికేట్ ఓటర్ ఐడీ కోసం EPIC - 002 ఫాం తీసుకుని వివరాలు నింపాలి. తర్వాత దీనికి FIR కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను ఆ ఫాంకు అటాచ్ చేయాలి.

  • అడ్రస్ ప్రూఫ్ కోసం గ్యాస్, విద్యుత్, టెలిఫోన్ బిల్లు, పాస్ పోర్ట్ మొదలైన వాటిలో ఏదో ఒక జిరాక్స్ కాపీని దానికి జత చేయాలి.

  • దీన్ని ఈసీ కార్యాలయంలో ఇస్తే మీకు ఓ రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. వెరిఫికేషన్ అనంతరం మీకు డూప్లికేట్ ఓటర్ ఐడీ జారీ చేస్తారు. ఈ కార్డు జారీ అయినట్లు మీకు మెసేజ్ రాగానే, ఎలక్టోరల్ కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా మీరు కార్డు తీసుకోవచ్చు.